ప్రజాశక్తి-మారేడుమిల్లి : 90శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలని శుక్రవారం జరిగిన వ్యవసాయ సలహా మండలిలో తీర్మానం చేశారు. ఎంపీడీవో వీర కిషోర్ సమక్షంలో వ్యవసాయ ఉద్యాన వనశాఖ అధికారి రమేష్ బాబు, మండల వ్యవసాయ అధికారి కె.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ గ్రీన్ హౌస్ ద్వారా కూరగాయలు పండించడానికి, అంతర పంటలు వేయడానికి, ఎగుడు, దిగుడు భూములు చదును చేయుటకు వంటి పరికరాలు అందజేయనున్నట్లు చెప్పారు. మండలంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వలన వాటిని ఈ ప్రాంతం నుండి దూరంగా పంపించడానికి తగు చర్యలు తీసుకుని నిమిత్తం సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి గొర్లె బాలాజీ బాబు, వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్ పాల్గొన్నారు.










