
ప్రజాశక్తి -బుచ్చయ్య పేట
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలు పేరు తేగాడ సన్నమ్మ, బుచ్చయ్యపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆమె వయస్సు సుమారు 90 ఏళ్లు ఉంటుంది. ఏన్నో ఏళ్లుగా వృద్ధాప్య పింఛను పొందుతున్న సన్నమ్మకు రెండున్నర సంవత్సరాలుగా పింఛను నిలిచిపోయింది.
తేగాడ సన్నమ్మకు నలుగురు కుమారులు రామునాయుడు, కోటేశ్వరరావు, పరదేశినాయుడు, మోదినాయుడు, కుమార్తె పార్వతమ్మ ఉన్నారు. వారు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు వేర్వేరుగా జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు రామునాయుడు (70 ఏళ్లు)కు వృద్ధాప్య పింఛను, రెండో కుమారుడు కోటేశ్వరరావు (68)కు వికలాంగు పింఛను వస్తుంది. కుమార్తె పర్రే పార్వతమ్మ (65)ను భర్త విడిచిపెట్టడంతో తల్లి సన్నమ్మతో కలిసి ఉంటుంది. గతంలో ఇద్దరికీ పింఛన్లు వచ్చేవి. అయితే తల్లీ కూతురు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడంతో రెండున్నరేళ్ల క్రితం తల్లి సన్నమ్మకు ప్రభుత్వం పింఛను నిలిపివేసింది. దీంతో వయోభారంతో సన్నమ్మ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ దృష్టి సన్నమ్మ పింఛను విషయాన్ని గ్రామస్తులు తీసుకెళ్లగా, త్వరలోనే పింఛను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వెంటనే సన్నమ్మకు పింఛను మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాని నేటికీ వృద్ధురాలికి పింఛను పునరుద్ధరణ కాలేదు. వయస్సు పైబడి సరిగా నడవలేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సన్నమ్మ తనకు పింఛను ఇప్పించండి అయ్యా అంటూ గ్రామానికి ఎవరొచ్చినా ప్రాధేయపడుతుంది.
పింఛను తొలగించడం దారుణం : టిడిపి
వృద్ధురాలి పింఛను తొలగించడం దారుణమని టిడిపి చోడవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను పునరుద్ధరించి బకాయిలతో సహా చెల్లిస్తామని చెప్పారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికి వెళ్లి తాతాయ్యబాబు దృష్టికి వృద్ధురాలి సన్నమ్మ పింఛను సమస్య వచ్చింది. ఈ సందర్భంగా సన్నమ్మ టిడిపి నాయకులు ముందు బోరని వినిపిస్తూ తన బాధలను చెప్పుకుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయింది. దీనికి స్పందించిన తాతయ్యబాబు ఈ సమస్యపై అధికారులు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.