Aug 07,2023 21:39

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం :   ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమత్‌ మహౌత్సవంలో నాభూమి-నాదేశం కార్యక్రమాన్ని ఈనెల 9నుంచి దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీరులను, త్యాగధనులను స్మరించుకునేందుకు మన జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 15వ తేదీ వరకు నేలతల్లికి నమస్కారం- వీరులకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఘన నివాళులు అర్పించనున్నట్టు చెప్పారు. తన ఛాంబర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శిలాఫలకాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిలాఫలకంలో ఆ గ్రామం నుంచి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారందరి పేర్లను పొందుపరచాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో కనీసం 75 మొక్కలతో అమత వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. దీర్ఘకాలం వుండే మొక్కలను చెరువు గట్లపై, కాలువ గట్లపై నాటాలన్నారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్‌, డిఇఒ లింగేశ్వరరెడ్డి, సెట్విజ్‌ సిఇఒ రాంగోపాల్‌, యూత్‌ ఆఫీసర్‌ ఉజ్వల్‌, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.