Apr 29,2023 00:45
సిఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్‌పి, జెసి, అధికారులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మే9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన జగనన్నకు చెబుదాం కార్యక్రమం, జగనన్న గృహ నిర్మాణాలు, భూ హక్కు, భూ రక్షణ, నాడు నేడు వసతి దీవెన కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పందన అర్జీల కంటే నాణ్యతతో జగనన్నకు చెబుదాం అర్జీలను పరిష్కరించాలన్నారు. ఇందుకు 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 21.25 లక్షల గృహాలను, 2.62 లక్షల టిడ్కో గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంతవరకు ప్రారంభించని 97 వేల గృహ నిర్మాణాలు వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివ జ్యోతి, సిపిఓ భరత్‌ కుమార్‌, జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాస్‌, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ అర్జున్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.