Mar 02,2023 22:49

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
         ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక, ఆర్ధికేతర సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9 నుంచి చేపట్టనున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ దామోదర్‌రావు కోరారు. గురువారం ఏలూరులోని రెవెన్యూ భవన్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని ఉద్యమ కార్యాచరణ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఛైర్మన్‌ కె.రమేష్‌, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.శివశంకర్‌, ప్రధాన కార్యదర్శి కె.ఫణికుమార్‌ మాట్లాడుతూ జెఎసి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను జిల్లాలో విజయవంతం చేస్తామన్నారు.
అనంతరం రాష్ట్ర నేతలు ఇరువురు ఏలూరు కలెక్టరేట్‌, ట్రెజరీ, కోఆపరేటివ్‌, డిఆర్‌డిఎ, ఎపిజిఎల్‌ఐ, సివిల్‌ సప్లయీస్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌చ, ఆర్‌డిఒ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తదితర జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను నేతలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.మల్లేశ్వరరావు, ఎ.సాంబశివరావు, జిల్లా నేతలు పాల్గొన్నారు.