Nov 05,2023 00:22

ప్రజాశక్తి-గుంటూరు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈనెల 8న చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని నాటి విశాఖ ఉక్కు నిర్మాణ సాధన కోసం జరిగిన ఉద్యమ భాగస్వామి డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక అరండల్‌పేటలోని పిడిఎస్‌యు కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో కలిసి బంద్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం 32 మంది ప్రాణాలు అర్పించారని, 67 మంది ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారని గుర్తు చేశారు. రూ.27 వేల కోట్లు అప్పులున్నాయనే పేరుతో విశాఖ స్టీల్‌ప్టాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కేంద్రం గనుల కేటాయింపులు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌జీ, యూత్‌కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు కె.జవహర్‌బాబు, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ఎం.కృష్ణకాంత్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.చైతన్య, ఎస్‌.కె.వలి పాల్గొన్నారు.