Nov 03,2023 01:00

పెదనందిపాడు సమావేశంలో నాయకులు

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) నిరంతరం పోరాడుతుందని జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 8న నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న నిరుద్యోగ పరిష్కారానికి పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ అవసరమన్నారు. ఇదే జరగకుంటే ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా భవిష్యత్‌లో నిరుద్యోగులుగా మారతారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎల్‌.అర్జున్‌, ఉపాధ్యక్షులుగా వి.రమేష్‌, జి.అభి, కార్యదర్శిగా ఎ.యశ్వంత్‌, సహాయ కార్యదర్శులుగా రమేష్‌, మహబూబ్‌ సుభాని ఎన్నికయ్యారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.కె సమీర్‌, భరత్‌చంద్ర పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాసర్‌జీ, ఎఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు చైతన్య, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ అనేక త్యాగాలతో విద్యార్థి యువజన నాయకుల 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యేల, ఎంపీల పదవి త్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్‌ 8 నాటికి వెయ్యి రోజులకు చేరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని విద్యార్థి, యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు నవంబర్‌ 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఇంతవరకు అమలు చేయలేదని, ఇది అమలైతే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే బిజెపి నాయకులు ఎందుకు అడగడం లేదని అన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు నిద్ర నటిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయో జనాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సిఎం రెండుసార్లు శంకుస్థాపన చేసినా పురోగతి లేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాత్విక్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఎం.అభిషేక్‌, వై.శివగోపి, భార్గవ్‌, హనోక్‌బాబు, అజరు, ఎం.సతీష్‌ పాల్గొన్నారు.