
ప్రజాశక్తి-పొన్నూరు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఈనెల 8న విద్యార్థి, యువజన సంఘాలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ కోరారు. పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో శుక్రవారం బంద్ పోస్టర్‌ను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆవిష్కరించారు. కిరణ్ మాట్లాడుతూ 32 మంది బలిదానం, వేలాది మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తుందన్నారు. విభజన హామీలలో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే ఉక్కు ఫ్యాక్టరీల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణని వ్యతిరేకిస్తూ చేపడుతున్న బంద్‌లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొ నాలని, అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సహక రించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె. సమీర్, పొన్నూరు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జమీర్, జావిద్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్, బాష, సమీర్, అబ్దుల్, షాహిల్, నాని, హర్ష, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.