Nov 04,2023 21:40

బంద్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి -కొమరాడ : విశాఖ ఉక్కు పరిరక్షణకై, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం చేయాలని కోరుతూ కేజీ టు పీజీ వరకు నవంబర్‌ 8న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు చేపట్టే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బంద్‌కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు, హెచ్‌.సింహాచలం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటానికి నవంబర్‌ 8నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు చేపడుతున్నాయన్నారు. 32 మంది కార్మికులు, యువకులు ప్రాణత్యాగం ప్రతిఫలం ఒక పరిశ్రమలను దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని అన్నారు. ఇటువంటి పరిశ్రమకు తప్పుడు లెక్కలతో నష్టాన్ని చూపించి ప్రైవేట్‌ పరం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి విధానం రాష్ట్ర ప్రజల పట్ల, దేశానికి ద్రోహం చేపట్టడమేనని విమర్శించారు. నేడు మూడు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులతో లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ విశాఖపట్నం అభివద్ధిలో కీలక పాత్ర పోషించిన స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా తమ అనుయాయులైన అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రను విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. రాష్ట్రానికే వెన్నుముక్కగా నిలిచిన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బిజెపి ప్రభుత్వం ఉపసహరించుకోవాలని, ఉక్కు కార్మిక సంఘాలు వెయ్యి రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ మోడీ స్పందించకపోవడం దుర్మార్గమని, పైగా కార్పొరేట్లకు అనేక ఆంక్షలతో దొడ్డి దారిన పరిశ్రమ మూతబడడానికి అనేక ప్రత్యామ్నాలు చేపడుతుండడం చాలా అన్యాయమని మండిపడ్డారు. ఎన్నికల్లో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ, పూర్తిగా మరిచారని ఇటువంటి మోడీ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన నాయకులు కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గమని, కేవలం అధికార లాభపేక్ష కోసం మోడీ నీడలో చేరి ముసలి కన్నీళ్ళ, గారడి మాటలు చేపడుతున్నారని వాపోయారు. కావున ఇకనైనా మోడీ మోసపూరిత వైఖరిని గమనించి రాష్ట్ర స్వప్రయోజనాల కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపడుతున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. బిజెపి మోడీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని ద్రోహాన్ని విస్తృతంగా అన్ని విద్యాసంస్థలకు, విద్యార్థుల వద్దకు ఈ బందు పిలుపు చేరుతుందని, ఈ బంద్‌ జయప్రదంకై విద్యాసంస్థ యాజమాన్యం, మేధావులు, అభ్యుదయవాదులు స్పందించి స్వచ్ఛందంగా బంద్‌ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దినేష్‌, ప్రవీణ్‌, కిరణ్‌, సందీప్‌, ముఖేష్‌ తదితరులు పాల్గొన్నారు.