
బెలగాం: విశాఖ ఉక్కు పరిరక్షణకు, కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలని కోరుతూ కేజీ టు పీజీ వరకు ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌ఒ, ఎఐవైఎఫ్, డివైఎఫ్‌ఐ సంఘాల నాయకులు కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో బంద్‌కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు, జిల్లా కన్వీనర్ ఎన్.నాగభూషణ్, పిడిఎస్‌ఒ జిల్లా కన్వీనర్ సోమేశ్, ఎఐవైఎఫ్ నాయకులు కోట అప్పన్న, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ఎం.వెంకటరమణ మాట్లాడారు. విశాఖ ఉక్కు పోరాటానికి ఈనెల 8తో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాలు ఈ బంద్‌ను చేపడుతున్నాయన్నారు. 32మంది కార్మికులు, యువకుల ప్రాణత్యాగం ప్రతిఫలం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని అన్నారు. ఇటువంటి పరిశ్రమకు తప్పుడు లెక్కలతో నష్టాన్ని చూపించి ప్రైవేట్ పరం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి విధానం రాష్ట్ర ప్రజలను, దేశానికి ద్రోహం చేయడమేనని విమర్శించారు. 23 వేల ఎకరాల విస్తీర్ణంలో కేవలం రూ.4800 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు రూ.54 వేల కోట్లు తిరిగి చెల్లించి 32 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నుల సామర్ధ్యాన్ని పెంచుకుందన్నారు. నేడు రూ.3 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులతో లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్టీల్ ప్లాంట్‌ను కారుచౌకగా తమ అనుయాయులైన అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కె.రాజు, సిహెచ్ సింహాచలం, ముకేశ్, నాగేంద్ర, పి.రవికుమార్ ఎ.సుమన్ తదితరులు పాల్గొన్నారు.