ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు విద్యార్థి, యువజన, నిరుద్యోగ, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం ప్రకటించింది. ఈ మేరకు సమావేశం నరసరావుపేటలోని ఎన్జీఓ హోంలో సోమవారం నిర్వహించారు. సమావేశానికి ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభానీ అధ్యక్షత వహించగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్జి, ఎపిఎన్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మర్రివేముల శ్రీనివాస్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఏనుగంటి భార్గవ్‌సాయి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోటా సాయి, ఎఐవైఎఫ్ నాయకులు జంగాల చైతన్య మాట్లాడారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న పోరాటం నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, ఫ్యాక్టరీ అనుబంధంగా ఇనుము గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధినిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే లక్షలాదిమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాల అభ్యున్నతికి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఃపరిశ్రమలు ఏర్పాటు హామీలను కేంద్రం విస్మరించడంపై రాష్ట్రంలోని బిజెపి నేతలు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, వివిధ సంఘాల నాయకులు టి.బాబురావు, యు.రాము, కె.రాంబాబు, బి.శ్రీనివాసరావు, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రెండుసార్లు శంకుస్థాపన చేసినా ఆచరణలో పురోగతి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సమావేశంలో యు.రంగయ్య, వి.వెంకట్ పాల్గొన్నారు.










