ప్రజాశక్తి-తెనాలి : తెనాలి పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఈనెల 8న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్నిక జరుగుతుందని, ఎన్నికల అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మను జిల్లా కలెక్టర్ నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు ఇప్పటికే ప్రకటించారు. పురపాలక సంఘానికి ఇరువురు వైస్ చైర్మన్ల సంప్రదాయానికి వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం నుంచే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలుత మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు వైస్ చైర్మన్‌లుగా ఎన్నికయ్యారు. ఏడాది కాలం పూర్తి కావటంతో గతేడాది డిసింబర్ 29న గుంటూరు కోటేశ్వరరావు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాళీగా ఉన్న రెండో వైస్ చైర్మన్ పదవి భర్తీకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగల్ ఇవ్వటంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టారు.
కౌన్సిల్‌లో మొత్తం 40 మంది సభ్యులుంటే, వారిలో 32 మంది వైసిపి వారే. కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఇస్తే వారి ఎన్నిక లాంఛనమవుతుంది. అయితే వైస్ చైర్మన్ రేసులో 11వ వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి పేరు ప్రథమంగా వినిపించినా, సామాజిక సమీకరణాల్లో వెనుకబడింది. దానికి కారణం రాజీనామా చేసిన కోటేశ్వరరావు కూడా అదే సామాజిక తరగతికి చెందిన వారు. ప్రస్తుతం 40వ వార్డు కౌన్సిలర్ అత్తోట నాగవేణి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 30వ వార్డు కౌన్సిలర్ కొమరాబత్తిని జయపాల్, 39వ వార్డు కౌన్సిలర్ గెడ్డటి ఝాన్సివాణి, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా సామాజిక సమీకరణలో ఎమ్మెల్యే ఆచాతూచి అడుగు వేస్తున్నారు. ప్రత్యేకించి ఎస్సీల్లో మాదిగ సామాజిక తరగతి కొంత అలకలో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇది అవకాశంగా ఎమ్మెల్యే భావిస్తున్నట్లు ఆ పార్టీలో విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే నిజమైతే అత్తోట నాగవేణి రెండో వైస్ చైర్మన్ కావటం ఖాయంగా తెలుస్తోంది. రాజకీయంగా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చివరి వరకూ వేచి చూడాల్సిందే.










