Jun 06,2023 23:58
కార్మికుల సంతకాల సేకరిస్తున్న సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌

ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మే 31వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్‌ ప్రచారయాత్ర 8వ తేదీ రేపల్లె వస్తున్న సందర్భంగా మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ గవర్నర్‌కు సమర్పించే వినతిపత్రంపై సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమం లో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 120 మున్సిపల్‌ పట్టణాల్లో, కార్పొరేషన్‌ నగరాల్లో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ప్రచార జాతాలు జరుగుతున్నాయని అన్నారు. అనంత పురం జిల్లా హిందూపురం నుంచి ఒక ప్రచారజాతా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మరో ప్రచార జాతా రాష్ట్రంలో 40 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ మున్సిపల్‌ కార్మికులు, 10 వేల మంది పర్మినెంట్‌ కార్మికుల వద్దకు, ఇంజనీరింగ్‌, క్లాప్‌ డ్రైవర్ల వద్దకు ఈ ప్రచార జాతాల ద్వారా వచ్చి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దానిలో భాగంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు రేపల్లె పట్టణానికి వచ్చే మున్సిపల్‌ ప్రచార జాతా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. కార్మికులను అప్కాస్‌ బోర్డులో చేర్చడం ద్వారా కార్మికులు పర్మినెంట్‌ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, వెంటనే ప్రతి కార్మికుడిని పర్మినెంట్‌ చేయాలని అన్నారు. అదేవిధంగా పర్మినెంట్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ కాకుండా పాత పెన్షన్‌ అమలు చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌ వర్కర్లుగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపల్లె మున్సిపల్‌ కార్మికులు గవర్నర్‌కు సమర్పించబోయే వినతిపత్రంలో సంతకాలు చేశారు.