
పుట్టపర్తి అర్బన్ : ఈ నెల 8వ తేదీన ధర్మవరంలో స్కిల్ డెవలెప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళా పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం ప్రతి నెలా 2వ శుక్రవారం స్కిల్ డెవలెప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ నెల 8వ తేదీన శుక్రవారం ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్ మేళాలో 13 రకాల కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ మాట్లాడుతూ ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే జాబ్ మేళాలో నిరుద్యోగులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, డిఎల్‌డిఒ శివ రెడ్డి, సిపిఒ విజరు కుమార్, ఎల్‌డిఎం రమణ కుమార్ పాల్గొన్నారు.