నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్
మే 14న ఛైర్మన్ పదవికి కవురు రాజీనామా
ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీపై సభ్యుల్లో హర్షం
ఆశావహులంతా ఛైర్మన్ గిరి కోసం ముమ్మర యత్నాలు
9 మంది బిసి జెడ్‌పిటిసిల్లో ఛైర్మన్ గిరి దక్కేదెవరికో
ప్రజాశక్తి కథనాలకు స్పందన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల నాలుగో తేదీలోపు జిల్లా పరిషత్ సభ్యులందరికీ సమాచారం అందించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎనిమిదో తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి ఛైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలని, ఒకవేళ ఎట్టి పరిస్థితులోనైనా ఆ రోజు సమావేశం జరగకపోతే తొమ్మిదో తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక పూర్తి చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. తొమ్మిదో తేదీన కూడా సమావేశం జరగని పక్షంలో ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉండటంపై కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛైర్మన్ ఎన్నిక జరపకపోవడంపై ప్రజాశక్తిలో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో అధికారులు స్పందించి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలోకి వెళ్తే జెడ్‌పి ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్ బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి ఆయనను ఎంఎల్‌సి అభ్యర్థిగా బరిలోకి దింపింది. కవురు శ్రీనివాస్ ఎంఎల్‌సిగా గెలుపొందడంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మే 14వ తేదీన కవురు శ్రీనివాస్ జెడ్‌పి ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి 15న ఎంఎల్‌సిగా ప్రమాణస్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన వెంటనే ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా వైస్ ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంది. అయితే జెడ్‌పికి ఇద్దరు వైస్ ఛైర్మన్లు ఉండటంతో ఎవరిని నియమించాలనే సందిగ్ధత నెలకొంది. దీంతో జెడ్‌పి ఛైర్మన్ పదవికి ఎన్నిక ప్రహసనంలా మారింది. దాదాపు 15 రోజులు దాటినా ఛైర్మన్ స్థానంలో ఎవరినీ నియమించకపోవడంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఛైర్మన్ పదవికి సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లా పరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఛైర్మన్ గిరి ఎవరికో..!
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బిసిలకు రిజర్వు అయ్యింది. దీంతో యలమంచిలి జెడ్‌పిటిసిగా గెలుపొందిన కవురు శ్రీనివాస్ అప్పట్లో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కవురు రాజీనామా చేయడంతో ఆ పదవిని బిసి తరగతికి చెందిన సభ్యులతోనే భర్తీ చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 48 మండలాలు ఉండగా 46 చోట్ల వైసిపి వారే జెడ్‌పిటిసిలుగా గెలిచారు. దీనిలో పది మండలాల్లో బిసి తరగతికి చెందిన జెడ్‌పిటిసి సభ్యులు ఉన్నారు. కవురు రాజీనామాతో ఇంకా భీమడోలు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, ఉంగుటూరు, పాలకోడేరు, పెదపాడు, ఉండి మొత్తం 9 మండలాల్లో బిసి తరగతికి చెందిన సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరిని జెడ్‌పి ఛైర్మన్ పదవి వరించనుంది. దీంతో వీరంతా తమ తమ ఎంఎల్‌ఎలను, ఎంపీలను, మంత్రులను కలుస్తూ ఛైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో ఛైర్మన్ పదవి ఈ సారి విభజిత ఏలూరు జిల్లాకు ఇవ్వాలని ఇక్కడి నాయకులు గట్టి పట్టుబడుతున్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. విభజిత పశ్చిమగోదావరి జిల్లా నుంచే శాసనమండలి ఛైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్, రెండు ఎంఎల్‌సి స్థానాలు, డిసిసిబి ఛైర్మన్, డిసిఎంఎస్ ఛైర్మన్ వంటి కీలక పదవులు చేజిక్కించుకున్నారు. కాబట్టి జెడ్‌పి ఛైర్మన్ పదవి ఏలూరు జిల్లాకు ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు.
ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో స్థానిక ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ పెదపాడు మండలానికి చెందిన జెడ్‌పిటిసి ఘంటా పద్మశ్రీకి జెడ్‌పి ఛైర్‌పర్సన్ పదవి ఖాయమని ప్రకటించారు. దీంతో ఛైర్‌పర్సన్ పదవి రేసులో ఘంటా పద్మశ్రీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల ఎనిమిదో తేదీన ఛైర్మన్ ఎవరనేది తేలిపోనుంది.










