Jul 09,2023 00:13

దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న జె.రామకృష్ణ

ప్రజాశక్తి-ఉక్కునగరం : పోరాటాలతోనే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యం అని పోరాట కమిటీ ప్రతినిధి జె.రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 877వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఆర్‌ఎంహెచ్‌పి, ఎసివిఎస్‌, హెచ్‌ఆర్‌ విభాగ కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి జె.రామకృష్ణ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా చేయతలపెట్టిన ఐక్య ఉద్యమాలతోనే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎదుర్కోవచ్చని తెలిపారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ, వాటిని కార్పోరేట్‌ పెద్దలకు కట్టపెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసేందుకే సొంత ఇనుప గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు మద్దతిచ్చే పార్టీలను 2024లో గెలిపించుకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను, కార్మిక హక్కులను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ దీక్షలో పోరాట కమిటీ ప్రతినిధులు జి.జయ, బిఎన్‌.రాజు, డిఎస్‌విఎస్‌.శ్రీనివాసరావు, వైవి.రమణ, కార్మికులు పాల్గొన్నారు.