Aug 18,2023 21:22

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమం 83 శాతం పూర్తి అయిందని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరినీ జాబితా నుంచి తొలగించవద్దన్నారు. అనంతరం కలెక్టర్‌ అరుణబాబు జిల్లాలో చేపట్టిన ఇంటింటి ఓటర్ల సర్వే కార్యక్రమం గురించి తెలియజేశారు. జిల్లాలో 5,48,750 ఇళ్లకు సంబంధించి ఓటర్ల జాబితా సర్వే చేయాల్సి ఉండగా, ఇంతవరకు 83 శాతం ఇళ్లను సర్వే పూర్తి చేశామన్నారు. మిగిలిన సర్వేను మూడు రోజులలో పూర్తి చేస్తామన్నారు. వీటిలో నకిలీ ఓటర్లు 633, ఇళ్లు మారినవారు 1929, మరణించిన ఓటర్లు 6952గా గుర్తించామన్నారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 100 సంవత్సరాలు వయస్సు దాటిన 67మంది ఓటర్లను గుర్తించమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌, పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో తిప్పేనాయక్‌, కదిరి ఆర్డీవో రాఘవేంద్ర, మడకశిర నియోజకవర్గం ఎన్నికల అధికారి చిన్నయ్య, సంబంధిత ఆయా నియోజకవర్గాల తహశీల్దార్లు పాల్గొన్నారు.