
ప్రజాశక్తి-గుంటూరు, పెదకాకాని రూరల్ : అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8 నుండి జరిగే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వై.నేతాజీ పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు గుంటూరు నగర పశ్చిమ కార్యాలయంలో అంగన్‌వాడీ గుంటూరు వెస్ట్ 3, 4, 5 సెక్టార్స్ సమావేశం చిన వెంకాయమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా జీతం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 99 శాతం హామీలు అమలు చేశామని చెప్తున్నారని, మరి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని అన్నారు. అంగన్వాడీలు ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగా రిటైర్ అయిన వర్కర్‌కు రూ.50 వేలు, హెల్పర్‌కు రూ.20 వేలు ఇస్తున్నారని, అయితే గ్రాట్యుటీ చట్ట ప్రకారం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అంగన్వాడీలు ఐక్యంగా సమ్మె చేయటం ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు గుంటూరు నగర తూర్పు, పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు కట్లగుంట శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా బి.ముత్యాలరావు, అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్.బాజీబి, చిన వెంకాయమ్మ, కోశాధికారిగా సుజాత, సహాయ కార్యదర్శిగా మొబీనా, ఉపాధ్యక్షురాలుగా మెర్సీగోల్డ్, మరో ఐదుగురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
మండల కేంద్రమైన పెదకాకానిలోని సిఐటియు కార్యాలయంలో కనకవల్లి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతాజితోపాటు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.శివాజి మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, దళితులైన వారికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నిలిపేశారని చెప్పారు. సెంటర్ అద్దెలు, బిల్లులు నెలనెలా చెల్లించని కారణంగా వాటిని అంగన్వాడీలు వారి జీతాల్లోనుండో, అప్పులు చేసో చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఆయా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోగా నిర్బంధాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అంగన్వాడి సమస్యలు పరిష్కారం, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, అంగన్వాడి కేంద్ర పిల్లలకు యూనిఫారం, తల్లిదండ్రులకు అమ్మబడి అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. సమ్మెకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. సమ్మెకు మద్దతు కోరుతూ వివిధ రంగాల ప్రజలకు, వినతిపత్రాలు ఇవ్వాలరని, రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని, మండల కేంద్రంలో సమ్మె శిబిరం ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. షబనా, తిరుమల, వెంకటేశ్వరమ్మ, నీరజ, ప్రభావతి, ధనశ్రీ, పావని పాల్గొన్నారు.