Nov 21,2023 22:38

సమ్మె నోటీసును అందజేస్తున్న అంగన్వాడీ యూనియన్‌ నాయకులు

* గ్రాట్యుటీపై సుప్రీం తీర్పునూ అమలు చేయని ప్రభుత్వం
* వేతన పెంపుపై సిఎం ఇచ్చిన హామీని అమలుచేయాలి
* మినీ వర్కర్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలి
* అంగన్వాడీ యూనియన్‌ నాయకుల డిమాండ్‌
* ఐసిడిఎస్‌ పీడీకి సమ్మె నోటీసు అందజేత
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
వేతన పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసును ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీకి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వేతనాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెర్చవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా, రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రిటైర్డ్‌ అయిన సందర్భంలో నామినల్‌ మొత్తం ఇవ్వడం వల్ల ఒంటరి మహిళలు, కుటుంబ ఆదరణ లేని వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలు సర్వీసులో చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయడం లేదని చెప్పారు. సమస్యలపై అంగన్వాడీలు దశల వారీగా అనేక ఆందోళనలు చేపట్టారని, అధికారులతో చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి సెంటర్లని మూసివేసి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. మినీ సెంటర్లను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.ఐదు లక్షలకు పెంచాలని, పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్‌ నాయుకులు కె.సుజాత, పి.లతాదేవి, బి.రమణమ్మ, వాగ్దేవి, విజయలక్ష్మి, ప్రమీల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.