ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 8వ తేదీ నుంచి అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ హెచ్చరించారు. శనివారం నగరంలోని గణేనాయక్ భవన్‌లో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మాతా, శిశుమరణాలు తగ్గించడానికి, పోషకాహారాన్ని అందించటానికి పిల్లల సమగ్ర అభివృద్ధి పథకం అమలు వంటి కార్యక్రమంలో అంగన్‌వాడీలు నిరంతరం పని చేస్తున్నారన్నారు. అయితే ఆయా పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించడంతోపాటు ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందన్నారు. మరోవైపు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం సైతం పోషకాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తోందన్నారు. అంతేగాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పాల ప్యాకెట్లను సరఫరా చేస్తోందన్నారు. ఇకపోతే ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు. సిఎం జగన్ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే మెరుగని వేతనాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. అంతేగాకుండా అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ, పదవీ విరమణ పథకాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదన్నారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్‌వాడీ రంగంలో ఉన్న అన్ని యూనియన్లు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించకపోతే వచ్చేనెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, జమున, కాత్యాయని, అరుణ, జయ భారతి, గోవిందమ్మ, రేష్మ, ధనలక్ష్మి, పాతక్క, తిప్పేరమ్మ, విజయలక్ష్మి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.