Mar 02,2023 22:24

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐద్యా, సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన సాంస్కృతిక బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఐద్వా పశ్చిమ నగర అధ్యక్ష, కార్యదర్శులు కుండనాల శేషుమణి, గాదె ఆదిలక్ష్మి తెలిపారు. గురువారం కొత్తపేటలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక - బహిరంగ సభ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం పంజా సెంటర్‌ సమీపంలోని ఖాదర్‌ సెంటర్‌లో సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా లోకానికి సేవలు అందించిన స్థానిక సీనియర్‌ మహిళా యోధులకు సన్మానం జరుగుతుందన్నారు. సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీదేవి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ ఎ.కమల, ప్రముఖ న్యాయవాదులు పొట్నూరి శారద, బలె వెంకట అరుణదేవి పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఇ.వి.నారాయణ, వెంకట్రావు, వెంకటరత్నం ఎస్‌.సుబ్బారెడ్డి, దేవదాసు, స్వప్న తదితరులు పాల్గొన్నారు.