Nov 03,2023 19:41

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ

7న సామాజిక సాధికార బస్సు యాత్ర
- జయప్రదం చేయండి : వైసిపి నేతలు
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

    ఆళ్లగడ్డ పట్టణంలో ఈ నెల 7న జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆకేపోగు అమర్నాథ్‌ రెడ్డి, వైసిపి ఎన్నికల పరిశీలకులు నరసింహారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డిలు కోరారు. శుక్రవారం స్థానిక గంగుల కార్యాలయ ఆవరణంలో తాలూకాలోని వైసిపి ముఖ్య నాయకులు, ఎంపిపిలు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలతో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఈ నెల 7న సామాజిక సాధికారిక బస్సుయాత్ర నంద్యాల జిల్లాలో మొట్టమొదటగా ఆళ్లగడ్డలోనే జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నాయని, సిఎం జగన్మోహన్‌ రెడ్డి సారధ్యంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారందరికీ పెద్దపీట వేసిందన్నారు. జిల్లా అధ్యక్షులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఒకసారి ఆలోచన చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు లోకల్‌ బాడీలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత పదవుల్లో పెద్దపీట ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర జలవనరుల ప్రభుత్వ సలహాదారులు, మాజీ విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బస్సు యాత్రతో ఎన్నికల శంఖారావం ప్రారంభమైనట్లేనని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాయబ్‌ రసూల్‌, వైసిపి రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్‌ బాబులాల్‌, ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గంధం రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.