Jun 05,2023 00:09

దుక్కులు దున్నుతున్న మంత్రి అంబటి రాంబాబు, జెసి శ్యామ్‌ ప్రసాద్‌ తదితరులు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : కృష్ణా డెల్టాకు జూన్‌ 7న, సాగర్‌ ఆయకట్టుకు జూన్‌ చివరి నాటికి సాగునీరు విడుదల చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పాల్గొని పొలంలో దుక్కులు దున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వర్షపు నీటిని వృథా కానీయకుండా, సముద్రంలో కలవనీయకుండా రైతులకు సిరులు కురిపించేందుకే నాటి సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞం ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తే ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ మిర్చి యార్డులోనే గతేడాది రూ.805 కోట్ల వ్యాపార కార్యకలాపాలు జరిగాయన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న రైతు ప్రకృతితో మమేకమవుతాడన్నారు. వ్యవసాయ అధికారులు కౌలు రైతులకు న్యాయం చేయాలని సూచించారు. పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ రైతులందరికీ ఆర్బికేల ద్వారా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సాగుకు దూరంగానే ఉన్నామని, అయినా రైతు సమస్యలు అర్థం చేసుకొని అసెంబ్లీలో వారి సమస్యల పరిష్కారం కోసం చర్చించానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రాజనారాయణ, నాయకులు సిహెచ్‌.సాంబశివరావు, పి.సూరిబాబు, సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.బాబురావు, డాక్టర్‌ నాగభూషణ్‌రెడ్డి, గీతాహసంతి, కె.విజయభాస్కరరెడ్డి, ఎంపీపీ వై.జైబూన్‌ బి, సర్పంచ్‌ మహాలక్ష్మి, ఉప సర్పంచ్‌ కె.లక్ష్మి, ఎంపీటీసీ వీరమ్మ, ఏపూరి శ్రీనివాసరావు, బి.రాఘవరెడ్డి, అచ్యుత శివ, ప్రసాద్‌, జైపాల్‌ పాల్గొన్నారు.