రాజంపేట అర్బన్ : జిఒ 77, 108లను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక ఐటిఐ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చిన జగన్ నేడు జిఒ నెంబర్ 77 తీసుకు వచ్చి ప్రయివేట్ కళాశాలలో పిజి చదివే విద్యార్థులు విద్యాదీవెన, వసతిదీవెన వర్తించదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆ జిఒతో అధిక ఫిజులు కట్టలేక, ఉన్నత చదువులు చదవలేక విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైద్యాశాఖ తీసుకువచ్చిన జిఒ నెంబర్ 108 కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరిట్ ఆదారిత ప్రవేశాలను పక్కదారి పట్టిస్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను వ్యాపార కేంద్రాలుగా మలిచి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఒక పక్క పిజి విద్యను నాశనం చేస్తూ ఇంకో పక్క వైద్య విద్యతో వ్యాపారం చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల పాలిట శాపమైన జిఒ నెంబర్ 77, 108లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమం చెపాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు గౌరీశంకర్ ఉపేంద్ర, చరణ్, చెంగయ్య, నరసింహ, భరత్ పాల్గొన్నారు.










