
73వ గణతంత్ర దినోత్సవాన్ని చారిత్రక చిహ్నాలు చెరిపేసి నిర్మించే 'సెంట్రల్ విస్టా'లో చేయాలని గాడ్సేల కుతంత్రం. ఇప్పుడు అక్కడే కరోనా సాకుతో పరిమితంగా జరపతలపెట్టారన్నది సమాచారం. తమ పాలిత రాష్ట్రాలు, హిందూత్వ చిహ్నాలతో ఉన్న శకటాలు మాత్రమే ప్రదర్శించేందుకు సిద్ధపడుతోంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల్లో వారి పాలనలోని కర్ణాటక మినహా మిగిలిన వాటికి అనుమతి లేదు. ఆంధ్రప్రదేశ్ నుండి మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య శకటాన్నీ తిరస్కరించింది. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని 23వ తేదీ నుండే ఉత్సవాలు నిర్వహిస్తామన్న కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వం తయారుచేసిన ఆయన శకటాన్ని తిరస్కరించింది. ఇవన్నీ గణతంత్రం స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలే. అసలు 'రిపబ్లిక్' అంటే 'గణతంత్రం'.. అంటే ప్రజలు తమను తాము పాలించుకునే పద్ధతి అని అర్థం. మనం మామూలుగా మాట్లాడే 'పబ్లిక్' అనే పదం నుండి వచ్చిందే 'రిపబ్లిక్'. గ్రీకు భాషలో 'రీ' అంటే వ్యవహారాలు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడే రోజుల్లో మనం సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవంగా జనవరి 26న నిర్వహించుకునేవాళ్లం. అయితే, అనుకోని విధంగా ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దాంతో 26వ తేదీని గౌరవార్థంగా రాజ్యాంగ ప్రకటనకు కేటాయించుకున్నాం. 1946లోనే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు సుదీర్ఘ మార్పులతో దానికి తుది రూపం ఇచ్చింది. ప్రపంచంలో అతి పెద్ద గణతంత్ర రాజ్యంగా మనదేశం రూపుదాల్చిన రోజు జనవరి 26వ తేదీకి భారత చరిత్రలో ఎందుకంతటి విశిష్టత? నేటి పరిస్థితుల నేపథ్యంపైనే ఈ ప్రత్యేక కథనం..
జనవరి 26 నే ఎందుకు ?
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అలాగే 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949, నవంబరు 26నే ఆమోదించారు. అయినప్పటికీ రెండు నెలలు వేచి ఉన్నారు. ఎందుకు? జనవరి 26న త్రివర్ణ పతాకం తొలిసారి ఎగిరింది 1930లో. లాహోర్ వేదికగా 1930, జనవరి 26న జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. అయితే ఈ కాంగ్రెస్ సమావేశంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు తదితరులు పాల్గొన్నారు. వీరంతా సమిష్టిగా స్వరాజ్య సాధనకు కృషి చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి, భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, స్వపరిపాలన (డొమినియన్ స్టేటస్) వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునే నేతల రాజీవైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తూ వచ్చింది.
నాడు కమ్యూనిస్టుల కృషితో భారత స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వరాజ్యం నినాదం ముందుకు వచ్చింది. 1921లో అహ్మదా బాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మహాసభలో ఇద్దరు కమ్యూనిస్టులు మౌలానా హస్రత్ మోహానీ, స్వామీ కుమారానంద 'సంపూర్ణ స్వరాజ్యం' తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోవియట్ విప్లవంతో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడంతో పాటు దోపిడీ, పీడనలేని కష్టజీవుల రాజ్యమైన సోషలిస్టు సమాజాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకుంది. దానికోసం ప్రజలను వర్గ, ప్రజా సంఘాల్లో సమీకరించి, అనేక వీరోచిత పోరాటాలు నిర్వహించింది.
స్వాతంత్య్రోద్యమంలో పెరిగిపోతున్న కమ్యూనిస్టుల ప్రాభావాన్ని, వారి భావజాలానికి ప్రజల్లో వస్తున్న ప్రతిస్పందననూ చూసి బ్రిటిష్ పాలకులు బెదిరిపోయారు. కమ్యూనిస్టు పార్టీని శైశవదశలోనే అంతం చేసేందుకు వరుసగా మూడు కుట్ర కేసులు బనాయించారు. 1922లో పెషావర్ కుట్ర కేసు, 1924లో కాన్పూర్ కుట్ర కేసు, 1929లో మీరట్ కుట్ర కేసులు పెట్టి, అనేక మంది కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు.
కమ్యూనిస్టులతో పాటు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. దీన్ని ఆమోదిస్తూ 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి గుర్తింపు కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి, 1950. జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.

1920లో ఎఐటియుసి ఏర్పాడ్డాక దాని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికవర్గాన్ని సంఘటితం చేయడమేగాక జాతీయోద్యమం ఆ కార్మికోద్యమాన్ని అనుసంధానం చేసింది కమ్యూనిస్టులు. అఖిలభారత కిసాన్‌సభ, విద్యార్థి ఫెడరేషన్, మహిళా సంఘం, ప్రజారచయితల, కళాకారుల వేదిక (ఇప్టా) వంటివి నిర్మించి, సామాన్య ప్రజానీకానికి జాతీయోద్యమం పట్ల చైతన్యాన్ని కల్పించింది కమ్యూనిస్టులే. 'అందరికీ తిండి-బట్ట-ఇల్లు', 'ఇంక్విలాబ్ జిందాబాద్' వంటివి జాతీయోద్యమ నినాదాలుగా మారుమోగడం వెనుక పాత్ర కమ్యూనిస్టులదే. అయితే ఇందులో ఒక్క కమ్యూనిస్టును కూడా లేకుండా చేయడం గమనార్హం. అయినప్పటికీ ఆ జాతీయోద్యమ స్ఫూర్తి రాజ్యాంగంలో ప్రతిబింబించక తప్పిందికాదు.
స్వతంత్ర భారతావని తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1950, జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. గణతంత్ర దేశంగా 1950, జనవరి 26న భారత్ అవతరించింది. దీని ప్రాముఖ్యత తెలుసుకుని, దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి, ప్రాణాలను వెచ్చించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు స్మరించుకోవాలి. నేటి యువతలో ఆ స్ఫూర్తిని నింపాలి.
సవరణలు..

అనేక సవరణల తర్వాత 1949, నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండేళ్ల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షల ఖర్చయ్యింది. రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం, అయినప్పటికీ అందులోని అనేకాంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. సర్ ఐవోర్ జెనింగ్స్ రాజ్యాంగ పరిషత్‌ను 'న్యాయవాదుల స్వర్గం' అన్నారు. జయప్రకాష్ నారాయణ 'స్పందనలేని న్యాయవాదుల తతంగం' అని మరో కోణంలో వ్యాఖ్యానించారు. 'దేశం ఎలాంటి కల్లోలిత పరిస్థితుల్లో ఏర్పడిందో వారు చూడలేకపోయారు. మౌలిక సంస్కరణలు చేయకపోతే లాభం లేదు!' అని ఆయన అన్నారు. ఇప్పటికీ రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారు. ధనికవర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఈ సవరణలలో అత్యధిక ప్రాధాన్యత లభించింది. శ్రామికవర్గ దృక్పథం, ప్రజాస్వామ్య పటిష్టీకరణ కోణం నుంచి చేయాల్సిన ముఖ్య సవరణలు అలాగే మిగిలిపోయాయి. అందులో పని హక్కును కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వాల తొలగింపు అవకాశాన్ని నిరోధించడం తదితరాలున్నాయి.
కీలకరంగాలకు తిలోదకాలు..

రాజ్యాంగం ప్రజలందరికీ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పించింది. మత స్వేచ్ఛ, నచ్చిన విశ్వాసం కలిగి ఉండటం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానతా సాధన వంటి సూత్రాలను ప్రతిపాదించింది. అందుకు తగ్గట్టే స్వాతంత్య్రం వచ్చాక తొలి రెండు, మూడు దశాబ్దాలలోనూ స్వావలంబన, స్వయం పోషకత్వం, లౌకిక ప్రజాస్వామ్యం, సంక్షేమ రాజ్యం వంటివి విన్నాం. ఇదంతా గతమైపోయింది ఇప్పుడు. మూడు దశాబ్దాలుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు స్వావలంబనను సమాధి చేశాయి. ప్రభుత్వరంగాన్ని పరాధీనం చేసే కార్పొరేటు విధానాలకు పట్టం కట్టాయి. ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యత విస్మరించి, ప్రతిదీ ప్రైవేటీకరించే తీరు పెరిగింది. రాజ్యాంగ ఆదేశ సూత్రాల్లో పేర్కొన్న సార్వత్రిక విద్య అమలులో మనం చాలా వెనకబడివున్నాం. పదేళ్లలోపు అందరికీ ఉచిత విద్య అందించాలని ఆదేశ సూత్రాలు చెప్పాయి. కానీ విద్యాహక్కు చట్టం వచ్చింది 2008లో మాత్రమే. ఇప్పుడు నూతన విద్యావిధానం దాన్ని పూర్తిగా నీరుగార్చేలా ఉంది. పౌష్టికాహారం, అందరికీ ఆరోగ్యం, సాంస్కృతిక అభివృద్ధి, నివాసం, ఉపాధి, స్వావలంబన, ప్రభుత్వరంగం, ఆహారభద్రత, హరితవిప్లవం తదితరాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇంకా అత్యధికులు దారిద్య్రరేఖకు దిగువనే ఉన్న దుస్థితి. అసమానతలు ప్రపంచీకరణతో మరింత తీవ్రమై, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం వంటి మాటే లేదు. రాజ్యం తన బాధ్యత నుండి తప్పుకోవాలనేదే ప్రపంచీకరణ ప్రధాన సూత్రం. ప్రతిదీ ప్రైవేటే..చివరికి బ్యాంకింగ్, బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి వంటి కీలక రంగాలను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడమే దాని విధానం.
వ్యవస్థల నిర్వీర్యం..
రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య సమతుల్యతతో కూడిన స్వయంప్రతిపత్తి కలిగించింది. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కేంద్ర నిరంకుశత్వానికి బలైపోతున్నాయి. ఆఖరికి అత్యున్నత న్యాయవ్యవస్థలోని సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒక సభలో ప్రధాని మోడీపై పూర్తి గౌరవం ఉందని చెప్పుకోవడం.. న్యాయమూర్తుల నియామకాల్లోనూ కేంద్రం జోక్యం చేసుకోవడం.
దేశాన్ని కాపాడే స్వతంత్రత కలిగిన సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం. దేశ రక్షణకు సంబంధించినంత వరకూ సైన్యాలు ప్రభుత్వాలకు లోబడే పనిచేస్తాయి. కానీ సైన్యాధికారులు రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం ఇప్పుడే చూశాం. కాశ్మీర్ సమస్య, పాక్‌తో, చైనాతో విభేదాల వరకూ సైన్యాన్ని కీర్తించడమే ఇప్పుడు దేశభక్తి. ఈ భావం పెంచడం దేశానికే ప్రమాదకరం. సైన్యాధిపతులు విధానపరమైన వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు చేయడం. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో అనేక ఆరోపణలను ఎదుర్కొంది. ఇవన్నీ అంబేద్కర్ చేసిన హెచ్చరికను గుర్తుచేస్తున్నాయి.
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం..
రాజ్యాంగం మొదటి అధికరణమే దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొనడం. కేంద్రం ఈ సమాఖ్యకు సారథి. అంతేగానీ రాష్ట్రాలు కేంద్రంలో భాగాలని ఎక్కడా పేర్కొనలేదు. రాష్ట్రాల హక్కులు, విధులు, వనరుల వివరాలు ప్రత్యేకంగా పేర్కొంది. నాడు కాంగ్రెస్, నేడు బిజెపి ప్రభుత్వాలు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసి, ప్రభుత్వాలను నిరంకుశంగా రద్దు చేశాయి. మోడీ ప్రభుత్వం ఏకంగా రాష్ట్రాలకు స్వయంపాలనను కల్పించే ప్రణాళికా సంఘాన్నే ఎత్తేసింది. అప్పుడు నీతి అయోగ్ పేరిట ప్రధాని కార్యాలయ ఆదేశాలే అమలయ్యాయి. ఇలా హక్కుల్ని హరించడం కేంద్రీకృత విధానానికి పరాకాష్టగా నిపుణులు చెప్తున్న మాట. అంతేకాకుండా లోక్‌సభా, శాసనసభా ఎన్నికలు ఒకేసారి జరపాలనే అసంబద్ధ విధానం తెచ్చారు. రాష్ట్రాల హక్కుల్ని హరించేలా అన్నింటిలో కేంద్రం పెత్తనం పెరిగిపోయింది. అది నదీజలాల వివాదాలైనా.. మరో వివాదమైనా.. మన రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకుండా.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రాజధాని అనేది నేటికీ సమస్యాత్మకంగా చేసి.. ఆంధ్రుల నోట్లో మట్టికొట్టింది. గతంలోలా రాష్ట్రాలూ ప్రధానంగా ప్రాంతీయపార్టీల పాలిత రాష్ట్రాలు హక్కుల కోసం గట్టిగా పట్టుబట్టకపోవడం ఓ వైఫల్యం. తమ స్వలాభం నేపథ్యంలో లొంగుబాటు ధోరణి పరిపాటైంది. ప్రజాభ్యున్నతి, నిత్యావసరాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ నేపథ్యంలో అవి బలహీనపడటం ప్రజలకూ నష్టం. రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌తో విలీన ఒప్పందం.. వారి మనోభావాలను పక్కనబెట్టి.. దేశంలో అంతర్భాగం అంటూ అక్కడ భూములపై పెత్తనం సాధించే కుట్రకు పాల్పడింది. అంతేకాదు ఈ పాలకుల నేతృత్వంలో పతాకావిష్కరణ, గీతాలాపనా వివాదమయ్యాయి.
పునాదిని రక్షించుకోవాలి..

కార్పొరేటీకరణ ప్రక్రియ నేపథ్యంలో మూడు నల్లచట్టాలు చేసి, రైతులను ఏడాది పాటు దేశ రాజధాని నడిరోడ్డుపై ఉంచింది. చివరకు రైతుల పోరాటానికి తలొగ్గక తప్పని పరిస్థితి. ఇదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకే ఒక అడుగు వెనక్కి అన్న లీకులు నేటికీ చేస్తున్నారు. ఏదేమైనా కార్పొరేట్లకు కొమ్ముకాసే ధోరణి ఒకవైపు.. దళితులు, వెనుకబడిన వారు, మైనార్టీలు, మహిళలు, పిల్లలు అభద్రతలో ఉన్నారు. రిజర్వేషన్ల విషయంలో వారి మధ్యే తంపులు పెట్టి, తమాషా చూస్తోంది. 21 ఏళ్ల వయస్సుకు అమ్మాయిలకు పెళ్లి అంటూ చట్ట సవరణతో చేస్తున్న ఆర్భాటమే కానీ ఆ ఆడపిల్లల అభ్యున్నతి పట్టదు. ఈ ఆతృత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద లేదు. మహిళలందరికీ ఉచితవిద్య, ఉపాధి గ్యారంటీ వంటి ఆలోచనలే లేవు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ప్రస్తుత పరిణామాలు దేశంలో జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, లౌకిక విలువల కోసం పోరాడటం.. రాజ్యాంగ పునాదిని రక్షించుకోవడమే నిజమైన గణతంత్ర స్ఫూర్తి.
ఇటీవల రైతాంగ పోరాటం ఓ చారిత్రక విజయం. మన రాష్ట్రంలో ఏడాదిగా సాగుతున్న ఉక్కు పోరాటం. ఇక ముందు ఇలాంటి మరిన్ని పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కమ్ముకొస్తోంది. ఈ గణతంత్రాన మన హక్కుల కోసమే పోరాడాల్సి ఉంది. ప్రాథమిక హక్కుల్లో పనిహక్కు, ఫెడరలిజాన్ని మరింత దృఢతరం చేసేందుకు కృషి జరగాలి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, లౌకిక సూత్రాల హరణకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1975లో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరాగాంధీని 1977లో ప్రజలు ఓడించారు. అప్పుడు వచ్చిన జనతా ప్రభుత్వ హయాంలో ఎవరూ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం లేకుండా రాజ్యాంగంలో సవరించారు. అదే తరహాలో ఇప్పుడు లౌకికతత్వం, సామాజిక న్యాయం, స్వావలంబన, మానవహక్కులు వంటి వాటికి చేటు తెచ్చే పోకడలను వెనక్కు నెట్టాలి.

'మతమేల.. గత మేల.. మనసున్ననాడు..
హితమేదో తెలియాలి మనిషైనవాడు..!
మన దేశమే ఓ పూలవనం..
పూవై వికసించాలి
ప్రతి జీవితం..
కుల మతాలు మాసిపోవాలి..
మన రక్తం.. నుదుట సింధూరం అరుణారుణం..
నదులన్నీ కలిసేది కడలింటిలోనే..
తారలు విరిసేది గగనంలోనే..
తలెత్తి నిలపాలి ఈ దేశాన్ని..
భయంలేని భవితను సాధించాలి సంఘమై..
ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి..
ఒకే మాట.. ఒకే బాట.. సాగాలి ఏకమై..
మనమంతా వెలిగించాలి నవ్యోదయం.
రాజ్యాంగ రచన నేపథ్యం..

రాజ్యాంగ రచనకు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసిన ఎంతోమంది మేధావులు ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. వారిలో అత్యధికులు న్యాయవాదులు. రాజకీయంగానూ వారు ఉన్నతస్థాయి నేతలే. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, బి.ఆర్.అంబేద్కర్, కె.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి న్యాయకోవిదులే. నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో రెండు ప్రధానమైన యూనియన్ రాజ్యాంగ, అధికారాల కమిటీలకు అధ్యక్షులు. రాష్ట్రాల రాజ్యాంగ, ప్రాథమిక హక్కులపై సలహా కమిటీలకి సర్దార్ పటేల్ అధ్యక్షులు. రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీ ఉండేది కనుక నెహ్రూ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పాట్నా బార్ కౌన్సిల్ అధ్యక్షుడైన డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకుంది. దానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ముందుగా నిర్ణయించేది. రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ అధ్యక్షులు కాగా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, టి.టి. కృష్ణమాచారి, మాధవరావు సభ్యులు. వీరంతా బ్రిటిష్ పార్లమెంటరీ విధానాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు. అయితే రాజ్యాంగం లోపరహితమని అంబేద్కర్ కూడా భావించలేదు. ఆయన 1949, నవంబర్ 25న ఇలా చెప్పారు.. 'ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు. దాన్ని అమలు జరపాల్సిన వాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు. అదే ఎంత చెడ్డ రాజ్యాంగమైనా అమలు జరిపేవారు మంచివారయితే బాగా పనిచేస్తుంది. ఒక క్రియాశీల రాజ్యాంగ పని మొత్తం దాని స్వభావంపైనే ఆధారపడి ఉండదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు వంటి వాటిని సమకూర్చడం మాత్రమే రాజ్యాంగం పని. ఈ యంత్రాంగాలు ఎలా పనిచేస్తాయనేది ప్రజలపైనా. వారు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా ఆధారపడి ఉంటుంది. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఎవరు చెప్పగలరు?'. ప్రస్తుత పాలకులు రాజ్యాంగంపైనా, దాని వివిధ విభాగాలపైనా చేస్తున్న దాడిని చూస్తుంటే.. అంబేద్కర్ అన్న ఈ మాటలు అక్షరసత్యాలని నిరూపితం.
చరిత్రలో లేకుండా చారిత్రక తప్పిదాలు..

స్వాతంత్య్ర పోరాటం వలసవాద వ్యతిరేక పరంపరలో వచ్చింది. మనం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శాంతికాముకమైన వర్ధమాన దేశాలలోనూ, సామ్యవాద శిబిరాలలో ఉంటూ అలీనోద్యమ పాత్ర పోషించాం. ఇది మన రాజ్యాంగం చూపిన దిశా నిర్దేశమే. ఇప్పుడు దీనికి తిలోదకాలు ఇచ్చి, అమెరికాకు సాగిలపడే ధోరణి మోడీ ప్రభుత్వ విధానం దేశానికి అవమానకరం. మన పాలకులకు పనిహక్కు తదితరాల గురించిన ధ్యాసే లేదు. పైగా లౌకిక, ప్రజాస్వామ్య సమాఖ్య పునాదులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. అద్వానీ న్యాయవాది అయినప్పటికీ 'విశ్వాసం కోర్టు తీర్పుకు అతీతం!' అంటూ.. బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆయన్ని మించిన ఘనుడు ప్రధాని మోడీ. హిందూత్వ జపం చేస్తున్నారు. దేశ రాజ్యాంగ లౌకిక పునాదుల కదలిపోయేలా.. ఆ చరిత్ర చెరిపేందుకు పూనుకున్నారు. అందులో భాగమే సెంట్రల్ విస్టా నిర్మాణం, జలియన్ వాలాబాగ్ స్మారక చిహ్నాల మార్పు. నిరంకుశ విధానాలతో కేంద్రంలోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, క్యాబినెట్ సమిష్టి పద్ధతి స్థానంలో.. ప్రధాని కేంద్రంగా, పరోక్షంగా అధ్యక్ష తరహా అమలవుతోందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మతసామరస్యం స్థానంలో మతోన్మాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఉగ్రవాద ప్రమాదం, దాడులు పెరిగేందుకు కారణమవుతోంది.
పౌరస్వేచ్ఛ.. హత్య..!

ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ పౌరస్వేచ్ఛ.. భావప్రకటనా స్వేచ్ఛ.. రాజ్యాంగంలో 19వ అధికరణంలో వాక్, సభా సంఘ, నివాస, సంచార, వృత్తి ఎంపిక స్వేచ్ఛలు కల్పించబడ్డాయి. పౌరుల మధ్య ఎలాంటి వివక్షా చూపించకూడదని 15వ అధికరణంలో పేర్కొన్నారు. మనదేశంలో ఏ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. అందరికీ ఒకే రక్షణ ఉండాలని 14వ అధికరణంలో చెప్పారు. అయితే, మోడీ హయాంలో పెరిగిన అసహన దాడులు భావప్రకటనా స్వేచ్ఛకు ప్రధాన ప్రతిబంధకాలయ్యాయి. కాశ్మీర్‌లో కల్లోలాలకు కారణమవ్వడమే కాకుండా.. అక్కడ ప్రజల హక్కులన్నింటినీ హరిస్తూ.. ఇటీవల ప్రెస్‌క్లబ్ మీద సైతం బిజెపి దాడి చేసింది. అలాగే హేతువాదం, లౌకికతత్వం అనేవి అపరాధాలుగా మారాయి.. అలాంటి భావప్రకటన చేసేవారిని నిలువునా చంపే ప్రమాదకర ధోరణి పెచ్చరిల్లింది. కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీ లంకేశ్ వంటివారి హత్యలు దేశాన్ని అట్టడుకేలా చేశాయి. విశ్వవిద్యాలయాల్లోనూ విద్వేష వాతావరణం వెల్లువెత్తింది. చివరికి సామాజిక మాధ్యమాల్లో తమతో విభేదించే, ప్రశ్నించే వారెవరైనా.. వ్యతిరేకత తెలిపేవారైనా దేశద్రోహులుగా పరిగణించే దుర్మార్గం పెల్లుబికింది. హైదరాబాద్‌లో రోహిత్ వేముల దుర్మరణం నుంచి జెఎన్‌యులో కన్నయ్యకుమార్ అరెస్టు, జెఎన్‌యులో విద్యార్థులపై దాడుల వరకూ అన్నీ ఆ తరహాలోనే వేధింపులు కొనసాగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఎ సిఎఎ విషయంలోనూ అదే ధోరణి.. ఒక మతం పట్ల వివక్షను ప్రస్ఫుటంగా చూపించింది. దీనిమీద వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో అనేకమంది వామపక్ష నేతలపైనా కేసులు పెట్టిన దుస్థితి.

ఏం తినాలో.. ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఏ సినిమా తీయాలో.. ఏ చిత్రం వేయాలో సంఫ్‌ుపరివారం నిర్దేశిస్తోంది. మహిళల ఆచార వ్యవహారాలపై ఆంక్షలు విధించడం.. అత్యాచారాలను సైతం వక్రీకరణ చేస్తూ బాధితుల పక్షాన కాకుండా.. నేరస్తుల తరఫున ర్యాలీలు చేసిన ఘనులు పరివారులు. అందుకు ఉదాహరణే ఆసిఫా సంఘటన. యుపిలో హత్రాసు ఉదంతం వీరి దుశ్చర్యలకు పరాకాష్ఠ. ఇక గో రక్షణ పేరుతో దాడులు ముస్లింలను, దళితుల హత్యల పరంపర.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అన్యమతాలకు చెందినవారు భారతీయులే కారనీ.. లొంగి ఉండాలనీ.. మాట్లాడటం మన రాజ్యాంగాన్ని అవమానించడమే.
శాంతిశ్రీ
8333818985