ఆమె ఒక విద్యార్థిని. నదులు, సముద్రంలోని నీరంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితం అవడం చూసి కలత చెందారు. ఆమె నాయకత్వంలో విద్యార్థులతో కొన్ని బృందాలను తయారుచేశారు. వారి సాయంతో నదులు, సముద్రంలోని 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మొసళ్లకు, తాబేళ్లకు, కీటకాలకు వాటి నివాసాన్ని మరలా కానుకగా ఇచ్చారు. ఆమే గుజరాత్‌కు చెందిన 23 సంవత్సరాల స్నేహషాహి. ఆమె గురించి మరెన్నో ఆసక్తికర విశేషాలు...
గుజరాత్‌కు చెందిన స్నేహ షాహి యుఎన్‌ఇపి (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్) యొక్క ప్లాస్టిక్ టైడ్ టర్నర్ క్యాంపెయిన్‌తో అనుబంధంగా ఉన్న 18 మంది యువ కార్యకర్తలలో ఒకరు. పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే ఆమెకెంతో ఇష్టం. 2019లో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఆ సమయంలోనే యుఎన్‌ఇపి నిర్వహించిన 'ప్లాస్టిక్ టైడ్ టర్నర్ ఛాలెంజ్'లో భాగస్వామి అయ్యారు. ప్రచారంలో ఇంప్లిమెంటింగ్ పార్టనర్ అయిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ (సిఇఇ) ఆమె కాలేజీకి వెళ్లినప్పుడు, అందులో చేరిన మొదటి విద్యార్థిని స్నేహ. తర్వాత ఆమె నాయకత్వంలోనే 300 మంది విద్యార్థులు అందులో భాగస్వాములయ్యారు. దాదాపు 90 మంది ఆమె చదివే కాలేజీ విద్యార్థులే. వారంతా కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఎలా వినియోగించాలి అనేదానిపై ఒక సర్వే నిర్వహించారు.
'ముందుగా క్యాంపస్ గుండా వెళుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన 'భుఖీ' నది కాలువను శుభ్రపరచాలి అనుకున్నాం. చాలా కష్టపడ్డాం. అందులోని 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. మేము ఊహించని ఫలితాన్ని పొందాము. అదేమిటంటే నెమ్మదినెమ్మదిగా మరలా నదిలోకి మొసళ్లు, తాబేళ్లు, ఇతర కీటకాల రాక మొదలైంది. ఇంకా మొక్కలూ పెరిగాయి. చాలా సంతోషం కలిగింది. ఇంతకాలం వాటి నివాసాన్ని మేమంతా ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి, నాశనం చేశామనే విషయాన్ని గుర్తించాం. భుఖి స్ట్రీమ్ ప్రాజెక్టు ద్వారా ఇదంతా సాధించగలిగాం. జీవరాశులన్నీ తిరిగి రావడంతో మా భద్రత కోసం విశ్వవిద్యాలయంలో కంచెలను ఏర్పాటు చేశారు. తొలగించిన వ్యర్థాలను రీసైకిల్ చేశాం. వాటితో వాల్ హ్యాంగింగ్‌లు, ప్లాంటర్స్‌ను ఏర్పాటుచేశాం. అప్పుడే భుఖి ప్రాజెక్టు మా బృందాన్ని ''యూత్ ఫర్ ఎర్త్'' అవార్డుకు నామినేట్ చేసింది' అంటున్నారు స్నేహ.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొని..
'మనలో చాలామందికి చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, వాగులలో వేయడం అలవాటు. అలా చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరించాం. మొదట్లో ప్రజలలో అవగాహన కల్పించడానికి మాకు చాలా కష్టమైంది. ప్రచారం ప్రారంభించిన కొద్ది నెలలకే విద్యార్థులతో పాటు, ఇరుగుపొరుగు ప్రజల వైఖరిలోనూ చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను విసిరితే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. వాటిని దగ్గరుండి మరీ తీయిస్తున్నారు. ఇంకా కొందరు మాతోపాటు క్లీనింగ్ యాక్టివిటీస్‌లో చేరడం సంతోషంగా ఉంది. నాకు ప్రకృతితో ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది. కొత్తకొత్త వ్యక్తులను కలవడానికి ఇదొక మంచి అవకాశం. మాలో సభ్యులు కావాలంటే ముందు మూడు స్థాయిల్లో ట్రైనింగ్ తీసుకోవాలి. రెండు స్థాయిలు దాటిన వారికి సముద్ర ప్లాస్టిక్ కాలుష్యం, దానిని ఎలా పరిష్కరించాలి? అనే దానిపై పూర్తి అవగాహన కల్పిస్తాం. వారిలో బాగా యాక్టివ్‌గా ఉన్నవారిని ఆ టీంకి లీడర్‌గా చేస్తాం. రేపటితరం కోసం నీటిని ఆదా చేయాలని నాతోటి యువతకు చెబుతూ ఉంటాను' అంటున్నారు స్నేహ.
'ప్లాస్టిక్ వ్యర్థాలను బాధ్యతారాహిత్యంగా పారవేయడం వల్ల వృక్షజాలం, జంతుజాలం, భూమి, నీటివ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మన దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రజలలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించాలి. టైడ్ టర్నర్స్ క్యాంపెయిన్‌లకు మేము మద్దతునిస్తున్నాం' అంటున్నారు అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రవి అగర్వాల్. 'ఒకప్పుడు భుఖీ నదివైపు వెళ్లేటప్పుడు చెత్తాచెదారం తప్పా ఏమీ కనిపించేది కాదు. కానీ నేటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆ నది దగ్గర కొంత సమయం వేచి ఉంటే 8,10 మొసళ్లు కనిపిస్తున్నాయి. ఇది నాకెంతో సంతోషాన్నిస్తుంది' అంటున్నారు స్నేహ. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో జీవరాశులను బతికించిన వాళ్లమవుతాం.