- అయినా సమస్యను పరిష్కరించడం లేదు
- 'స్పందన'లో మత్స్యకార వృద్ధురాలు ఆవేదన
- ఇళ్లస్థలాలు ఇవ్వాలని చాపురం గ్రామస్తుల వినతి
- రణస్థలం ఎపిఎంపై చర్య తీసుకోవాలని మహిళల ఫిర్యాదు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: హద్దులను సరిచేసి, తన భూమిని అప్పగించాలని ఏడు వారాలుగా స్పందన కార్యక్రమానికి వస్తున్నా, తన సమస్యను పరిష్కరించడం లేదని సోంపేట మండలం ఉప్పలాంకు చెందిన మత్స్యకార వృద్ధులు నరసమ్మ కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వద్ద వాపోయింది. నాలుగుసార్లు చలానా తీసినా సోంపేట తహశీల్దార్, సర్వేయర్ స్పందించడం లేదని, మీరైనా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ప్రతి వారం వస్తున్నానని చెప్పింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 213 మంది వినతులు అందజేశారు. శ్రీకాకుళం మండలం చాపురానికి చెందిన మహిళలు తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. తమ గ్రామ సమీపాన టిడ్కో, జగనన్న కాలనీలు ఉన్నా గ్రామంలో నిరుపేదలకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఫిర్యాదు చేశారు. రణస్థలం మండలం కోటపాడులో గ్రామ కమిటీ తీర్మానం లేకుండా ఎపిఎం ఇష్టారాజ్యంగా విఒఎలను తొలగిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆమె వేధింపులకు పాల్పడుతున్నారని 38 సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మార్పు చేయాలని పూలే-అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు గుజ్జల సూర్యనారాయణ కోరారు.
అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
ఆన్‌లైన్‌లో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కొంక్యాన వేణుగోపాల్, ఎన్.ఈశ్వరరావు కోరారు. జిల్లాలో 1200 మందికి పైగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారని, గతంలో వీరందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేవని గుర్తుచేశారు. ప్రస్తుతం నిబంధనల పేరిట కోతలు విధించడంతో జర్నలిస్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యక్రమాల కవరేజ్‌కు అక్రిడిటేషన్ అవసరమని తెలిపారు.
పెండింగ్ వినతులు సత్వర పరిష్కారం
నిర్ణీత సమయంలో స్పందన వినతులను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమం అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. మండలాల వారీగా పెండింగ్ లేకుండా పరిష్కారం జరగాలన్నారు. పలాస మండలం బొడ్డపాడు వద్ద సుడా ఏర్పాటు చేసిన స్మార్ట్ టౌన్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, డిపిఒ రవికుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










