Aug 03,2023 21:09

- మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు

రాయచోటి టౌన్‌ : గ్రామ సేవకుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 7,8 తేదీల్లో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాను విజయంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో గ్రామ సేవకుల సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి గ్రామ సేవకులను రెగ్యులర్‌ చేస్తానని, జీతం పెంచుతానని, పిఆర్‌సి అమలు చేస్తానని, అబద్దపు హామీలతో పోస్టులు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయకపోగా ఇచ్చిన డిఎను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. నామినీలను విఆర్‌ఎలుగా నియమించాలని, అర్హులైన వారికి అర్హులైన వారికి గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు. విఆర్‌ఎ వ్యవస్థ లేకుండా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వచ్చే ఎన్నికల్లో గ్రామ సేవకులు బుద్ది చెబుతారని తెలిపారు. డిఎలు ఇవ్వాలని, రీసర్వేలో ప్రతి విఆర్‌ఎకు డిఎలతోపాటు ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేసవిలో తీవ్ర ఎండలకు రీ సర్వేలో పాల్గొని గుండెపోటుతో చనిపోయిన గ్రామ సేవకుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. పిఆర్‌సి అమలుచేయాలని 7,8 తేదీల్లో నిర్వహించే ఆందోళన కార్యక్రమాన్ని జిల్లాలోని గ్రామ సేవకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సేవకుల సంఘం జిల్లా కన్వీనర్‌ యస్‌. అల్లా బకాష్‌, కో - కన్వీనర్‌ జి. భోగేశ్వరయ్య, కోడూరు డివిజన్‌ అధ్యక్షుడు కె. సుధాకర్‌, కలికిరి రెడ్డెయ్య, రాయచోటి అధ్యక్షుడు పి. నరసింహులు, ఆర్‌ .రామ్మోహన్‌, చండ్రాయుడు, రామయ్య, శివప్రసాద్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.