Nov 04,2023 22:40

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఈ నెల 6న రాజమహేంద్రవరంలో జరుగుతున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాల యంలో శనివారం ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ 30న శ్రీకాకుళంలో ప్రారంభమైన సిపిఎంప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర నవంబర్‌ 6 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేం ద్రవరం చేరుకుంటుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభలో సిపిఎం రాష్ట్ర నాయకత్వం మంతెన సీతారాం, వి.ఉమామహేశ్వ రరావు, ఎవి.నాగ్రశ్వరరావు, కె.ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దేశంలో మోఢ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నెత్తిన భారాలు, కార్పొరేట్లకు లాభాలు వచ్చేలా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్‌ సంస్థలు లాభాలను గడిస్తుంటే, మధ్య చిన్నతరహా పరిశ్రమలు మూతపడి కోట్లాదిమంది కార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోఢ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఊసే లేకుండాచ చేశారని ధ్వజమెత్తారు. దేశంలోని వివిధ ప్రభుత్వ శాకల్లో సుమారు 14 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సివుందన్నారు. రైతాంగం తీవ్ర సంక్షేపంలో ఉందని, రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు పోవాల్సిన దుస్థితి ఈ పాలనలో ఏర్పడిందని విమర్శంచారు. అటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడం తప్ప ప్రజలకు వేరే మార్గం లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మోడీ బాటలోనే నడుస్తుందని, సంక్షేమం పేరుతో అభివృద్ధి మాట మరిచారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షలకుపైగా ఉన్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, ప్రభుత్వ పథకాలు, అమలు చేయకుండా వారితో వెట్టి చాకిరి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడానికి, బూతు పురాణాలు మాట్లాడుకోవడానికి చట్టసభలను, రాజకీయాలను పరిమితం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు 30 రకాల సమస్యలను ప్రజా మేనిఫెస్టోగా ప్రజల ముందు ఉంచి, వాటిని ప్రజలు, రాజకీయ పార్టీలు చర్చించేళా చేసేందుకు సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను ప్రారంభించిందని, యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో తూర్పుగోదావరి జిల్లాలోని కార్మికులు, రైతులు మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.పవన్‌, జువ్వల.రాంబాబు, ఎం.సుందర బాబు, వి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.