Nov 02,2023 22:11

ప్రజాశక్తి - బిక్కవోలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న రాజమహేంద్రవరంలో జరుగుతున్న సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ పిలుపునిచ్చారు. స్థానిక వీరభద్రపేటలోని కమ్యూనిటీ హాల్లో గురువారం సిఐటియు మండల జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజులోవ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్కీం వర్కర్లు, సంఘటిత రంగ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగు లకు, ఇతర ప్రజలకు అనేకమైన హామీలను ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శం చారు. అంగన్‌వాడీ, ఆశా, మిడ్డే మీల్స్‌, యానిమేటర్లు, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇఎస్‌ఐ, పిఎఫ్‌, గ్రాడ్యుటీ వంటి సౌకర్యాలను విస్మరించారని అన్నారు. నాలుగున్నరేళ్ల జగన్‌ పాలనలో ఆయా వర్కర్లపై అధికార రాజకీయ వేధింపులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శంచారు. ఆయా యూనియన్ల నాయకత్వం పలు దఫాలుగా ఎంఎల్‌ఎలు, మంత్రులు, అధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో కనీస వేతన చట్టానికి సవరణ చేసి 15 సంవత్సరాలు గడిచినా నేటికీ ఆ చట్టం అమలు చేయడం లేదని, తక్షణమే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి సభ రాజమహేంద్రవరంలో ఈ నెల 6న జరుగుతుందని, ఆ సభలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని రాజులోవ పిలుపునిచ్చారు. సిఐటియు మండల సమన్వయ కమిటీ కో కన్వీనర్‌ బి.మార్త, నాయకులు సూరిబాబు, కార్మికులు పాల్గొన్నారు.