ప్రజాశక్తి-రాంబిల్లి
నేవీ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6న రాంబిల్లి తహశీల్దారు కార్యాలయం వరకు ఎనిమిది గ్రామాల నిర్వాసితులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు నేవీ నిర్వాసిత జెఎసి నాయకులు తెలిపారు. నేవీ గేట్ వద్ద నిర్వాసితులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి 34వ రోజుకు చేరింది. ఈ ధర్నా శిబిరం వద్దకు మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు శనివారం వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కొన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు కదా, సహకరించి టెంటు తీసేస్తే బాగుంటుందని చెప్పారు. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు బంధించి, డ్రెజ్జింగ్ పనులు చేపట్టి, చేపల వేటకు జెట్టీ నిర్మాణం చేయకపోవడమా? మాకు చేసే న్యాయం? అని ప్రశ్నించారు. జెట్టీ కట్టకపోతే తాము చేపల వేట ఎలా చేస్తామని నిలదీశారు. రెండు నెలల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందామని ప్రయత్నించడమా? జిల్లా కలెక్టర్ చేస్తున్న న్యాయం అని అడగడంతో మత్స్యశాఖ జెడి వెనుదిరుగారు. తమ సమస్యలు పరిష్కరించక పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిర్వాసిత నాయకులు స్పష్టం చేశారు. ఈనెల 6న జరగనున్న ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. తక్షణమే జెట్టీని నిర్మించాలని, అంత వరకు నేవీ గేట్లు తెరిచి శారదా నది గుండా వేటకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం భూములు, నదులు, గ్రామాలు తీసుకొని, ఉపాధి కల్పిస్తామని, మెరుగైన జీవితం వస్తుందని నమ్మించి, ఇప్పుడు తమ సమస్యలపై ఆలోచన చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను జిల్లా అధికారి యంత్రాంగం, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










