Oct 04,2023 22:50

ప్రజాశక్తి-గన్నవరం : రవాణా రంగ కార్మికుల హక్కు లను, ప్రయోజనాలను కాపాడాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు
చేయాలని కోరుతూ అక్టోబర్‌ 6 తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి పోలినాయుడు పిలుపునిచ్చారు. బుధవారం గన్నవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడలో ధర్నా చౌక్‌లో జరిగే మహా ధర్నాలో డ్రైవర్లు, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. దేశాభివద్ధిలో రవాణా రంగం యొక్క పాత్ర కీలకమైనదని, 85శాతం ప్రయాణికులు 60 శాతం వస్తువులు రోడ్డురవాణా ద్వారా జరుగుతున్నదన్నారు. జిడిపిలో రవాణా రంగం యొక్క భాగం 4.60 శాతంగా ఉన్నదనీ, వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం కూడా రవాణా రంగమేనని సుమారు 10 కోట్ల మంది రవాణా కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 95 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారనీ ఈ కార్మికుల స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయన్నారు. ప్రాణాలను సహితం ఫణంగా పెట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఎదుర్కొని 24 గంటలు రోడ్డుపైనే ఉంటున్నారనీ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన చేయకపోవడం వలన కుటుంబపోషణ కొరకు డ్రైవింగే వత్తిగా చేసుకుని యువత ఆటో, ట్రాన్స్పోర్ట్‌ డ్రైవర్లుగా మార్పు చెందుతున్నారనీ తెలిపారు. వీరికి కనీసవేతనాలు లేవనీ ఇచ్చే వేతనం కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఈ కార్మికులు చట్టబద్ధమైన పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, 8గంటలపని, వారాంతపు సెలవులకు నోచుకోవడంలేదన్నారు. సామాజిక భద్రతా లేదు, ఈ పరిస్థితులు మారాలన్నారు. ఎంతమంది కార్మికులు పనిచేస్తు న్నారనే దానితో నిమిత్తంలేకుండా స్వయం ఉపాధి కార్మికులతో సహా కార్మికులందరికీ చట్టబద్ధమైన ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రోడ్డు రవాణా కార్మికులందరికీ సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.