
ప్రజాశక్తి - విజయవాడ : ఆటో, మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 6న చలో విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే మహాధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం రైల్వేస్టేషన్ పార్సిల్ ఆఫీస్ గేటు వద్ద జరిగిన ప్రచార భేరి కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బి.జె.పి రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వాలు ఆటో, మోటార్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు, విజయవాడ సెంట్రల్ సిటీ ఆటో వర్కర్ యూనియన్ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంత రావు, రైల్వే స్టేషన్ పార్సెల్ ఆఫీస్ గేట్ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు బి.లక్ష్మణ, జె.సూర్య నారాయణ, బి.వెంకటేశ్వరరావు, ఎం.కొండ, జి.తిరుమల పాల్గొన్నారు.