ప్రజాశక్తి-అనకాపల్లి, సబ్బవరం
అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 6న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపునిచ్చింది. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుర్గారాణి, మజ్జి నాగ శేషు, గౌరవ అధ్యక్షులు జి.కుమారి అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడగా, సబ్బవరం ప్రాజెక్టు అధ్యక్షులు వివి.రమణ ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లు, రెండు నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, వేతనంలో సగం పింఛను ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రేటు సూపర్వైజర్ పోస్టులకు వయో పరిమితి తొలగించాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్ కందిపప్పు పరిమాణం పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ నిర్ణయించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, సర్వీస్ ఉండి చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని, సభలు సమావేశాలు ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 6న చేపట్టే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.










