ప్రజాశక్తి-నెల్లూరు :జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత కలిగిన 6,891 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా రూ. 9.08 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు జాయింట్ కలెక్టరు ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందిం చడంలో భాగంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, డిఆర్డిఏ, మెప్మా పిడీలు సాంబశివా రెడ్డి, రవీంద్ర, డిడి సోషల్ వెల్ఫేర్ రమేష్, జిల్లా బిసివెల్ఫేర్ అధికారి వెంకటయ్య,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా దేవి, ద్వైవార్షిక నగదు మంజూరు లబ్ధిదారులు పాల్గొన్నారు. అనంతరం ద్వై వార్షిక నగదు మంజూరు కింద జిల్లాలోని 6,891 మందికి 9.08 కోట్ల రూపాయల మెగా చెక్కును, పింఛన్దారులకు పింఛన్ మంజూరు పత్రాన్ని జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, లబ్ధిదారులకు అందచేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, నవరత్నాల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు వర్గాల అభ్యున్నతికి నవరత్నాల కార్యక్రమం క్రింద అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.
ఏదైనా సాంకేతిక కారణాలు, ఇతరత్రా కారణాల వలన వివిధ సంక్షేమ పధకాలు అందని లబ్ధిదారులకు ద్వై వార్షిక నగదు మంజూరు కింద రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత లబ్ధిదారులకు వారి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. అందులో భాగంగా జిల్లాలో అమ్మవడి పధకం కింద 896 మందికి ఒక కోటి 34 లక్షల 40 వేల రూపాయలు, చేదోడు పధకం కింద 2506 మందికి 2 కోట్ల 50 లక్షల 60 వేలు, ఈబిసి నేస్తం కింద 617 మందికి 92.55 లక్షలు, మత్స్యకార భరోసా కింద 5 మందికి 50 వేలు, నేతన్న నేస్తం కింద 33 మందికి 7.92 లక్షలు, జగనన్న విద్యా దీవెన కింద 1557 మందికి 3 కోట్ల 3 లక్షల 29 వేల రూపాయలు, జగనన్న వసతి దీవెన కింద 1206 మందికి ఒక కోటి 13 లక్షల 86 వేలు, రైతు భరోసా కింద 71 మందికి 5.10 లక్షలు మొత్తం 6891 మంది లబ్ధిదారులకు 9.08 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో నగదును జమచేస్తున్నట్లు తెలిపారు. ఇంకనూ అర్హత వుండి ఏ పధకం కింద లబ్ధి అందకపోతే దగ్గరలోని సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వివరించారు.










