ప్రజాశక్తి - ఏలూరు
చిరువ్యాపారులకు జగనన్న తోడు ఊతంగా నిలుస్తుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. బుధవారం ఈ పథకం ఆరో విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, ఇప్పటికే రుణాలు పొంది సకాలంలో చెల్లించినవారికి సంబంధించిన వడ్డీ రాయితీని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు, మెప్మా పీడీ ఇమ్మానియేల్, పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ఆరో విడతలో జిల్లాలో 6,733 మంది లబ్ధిదారులకు ఒకొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.6.73 కోట్లు లబ్ధిదారులకు జమచేశామన్నారు. ఇప్పటికే రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 29,300 మంది లబ్ధిదారులకు రూ.73 లక్షలు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధిదారులకు జమచేశామని తెలిపారు. చిరు వ్యాపారులకు ఈ పథకం అండగా నిలుస్తోందని, తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే, తిరిగి వడ్డీలేని రుణాలు పొందొచ్చన్నారు. జిల్లాలో ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకునే 3,856 మందికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయన్నారు. పట్టణాల్లో 2,877 మందికి ఎలాంటి పూచికత్తూలేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ.10 వేలు చొప్పున రుణాలు అందిస్తుందన్నారు. అనంతరం చిరువ్యాపారులకు నమూనా చెక్కులను అందజేశారు.










