Nov 08,2023 08:05

- 10 శాతం ఇడబ్ల్యుఎస్‌ కోటా అదనం
- నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం
పాట్నా : రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇబిసి వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా, తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన తరగతులకు (ఇడబ్ల్యూఎస్‌) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం రిజర్వేషన్లకు దీనికి అదనం. బీహార్‌ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఒబిసి మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలకు 20 శాతం, ఒబిసి, ఇబిసిలకు 43 శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఒబిసి, ఇబిసిలకు కలిపి 30 శాతం రిజర్వేషన్‌ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టి) వారికి 2 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఇబిసిలకు 18 శాతం, ఒబిసిలకు 12 శాతం, ఎస్‌సిలకు 16 శాతం, ఎస్‌టిలకు ఒక శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
కులగణనకు సంబంధించిన నివేదికను బీహార్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఒబిసిల్లో యాదవులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14.27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బీహార్‌ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఇబిసిలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్‌సిలు, 1.7 శాతం ఎస్‌టి జనాభా, జనరల్‌ కేటగిరిలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందినవారే ఉన్నారు.