Jan 03,2023 00:05

ఆందోళన చేస్తున్న నేవీ నిర్వాసితులు

ప్రజాశక్తి-రాంబిల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎఒబి ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులు మండలంలోని వాడనర్సాపురం సమీపంలో నేవీ గేటు ముందు చేస్తున్న ఆందోళన సోమవారం నాటికి 64వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిర్వాసిత జెఎసి పెద్ద మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలపై దృష్టి పెట్టిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బాధలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియడం లేదని, మండల, జిల్లా అధికారులు కూడా తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌ ప్యాకేజీలు ఇవ్వాలని, జెట్టీ నిర్మాణం చేపట్టాలని, అంత వరకు నేవీ గేట్‌ లోపల నుంచి చేపల వేటకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అనకాపల్లి, అమరావతి వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాలు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.