ప్రజాశక్తి- ములగాడ : జివిఎంసి 62వ వార్డు పరిధి దుర్గానగర్‌లో కీర్తిశేషులు డి.రామునాయుడు, జి.మోహన్, ఎం.మోహన్, డిల్లేశ్వరరావు, శివకుమార్ జ్ఞాపకార్థం ఆదివారం నిర్వహించిన విండ్ బాల్ టోర్నమెంట్‌ను వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, టిడిపి వార్డు అధ్యక్షుడు మజ్జి మాలినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో కీర్తిశేషులైన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలవుతూ, జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆటపాటల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడం, శారీరక దృఢత్వం కలుగుతాయని పేర్కొన్నారు. దుర్గానగర్ గ్రామ కమిటీ, దుర్గానగర్ యూత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.










