ప్రజాశక్తి-సింహాచలం: సింహాచలం తొలి పావంచా నుంచి అడవివరం వరకు బిఆర్‌టిఎస్ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే బాధితులు తీవ్రంగా నష్టపోతారని జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పేర్కొన్నారు. బిఆర్‌టిఎస్ బాధితుల సమావేశం ఆదివారం సాయంత్రం అడవివరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గంగారావు హాజరై మాట్లాడారు. బిఆర్‌టిఎస్ బాధితులకు నోటీసు ఇచ్చినప్పుడు 100 అడుగుల రోడ్డు వేస్తామని చెప్పి ఈ నెల 23వ తేదీన పేపర్ ప్రకటనలో 60 మీటర్ల రోడ్డుకు జివిఎంసి మాస్టర్ ప్లాన్‌లో ఆమోదం పొందిందని పేర్కొన్నారని తెలిపారు. దీని వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నందుకు నిరసనగా సోమవారం ఉదయం 7 గంటలకు పాత అడవివరం జంక్షన్ నుంచి ఘోషాల వరకు పాదయాత్ర చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో బాధితులు టీవీ.కృష్ణంరాజు, సిహెచ్.సత్యనారాయణ, లంక అప్పలరాజు, ఆల్తి నాగమణి, పిల్లి సుకన్య తదితరులు పాల్గొన్నారు.










