Aug 01,2023 00:09

సింహాచలం తొలిపావంచా సమీపంలో రాస్తారోకో చేస్తున్న గంగారావు, బాధితులు

ప్రజాశక్తి-సింహాచలం: జివిఎంసి 98వ వార్డు పరిధి సింహాచలం తొలి పావంచా నుంచి అడవివరం వరకు బిఆర్‌టిఎస్‌ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే తీవ్రంగా నష్టపోతామంటూ 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, టిడి.కృష్ణంరాజు, సిపిఎం నాయకులు పనివాడ వెంకటరావు ఆధ్వర్యాన బాధితులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు అంటూ ఈనాడు దినపత్రికలో విడుదలచేసిన ప్రకటనను వ్యతిరేకించారు. తొలిపావంచా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మాస్టర్‌ ప్లాన్‌ 2041 ముసాయిదాపై అభ్యంతరాలు కోవిడ్‌ సమయంలో కోరడం వల్ల బాధితులకు తెలియలేదన్నారు. ప్రస్తుతం మొదటి దశలో 30 మీటర్లు విస్తరణ, తర్వాత మరో 30 మీటర్లు వరకు ఏ విధమైన నిర్మాణాలూ చేపట్టడానికి వీళ్లేదని పేర్కొనడం తగదన్నారు. 60 మీటర్ల మేర విడిచిపెడితే సాధారణ ప్రజలు ఉండడానికి నివాసం లేకుండా పోతుందన్నారు. రోడ్డు విస్తరణను 30 మీటర్లకు తగ్గించాలని, 30 మీటర్ల అనంతరం ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకునేందుకు జివిఎంసి ప్లాన్‌ మంజూరు చేయాలని, నష్టపరిహారంగా 1:5 టిడిఆర్‌ ఇవ్వాలని, 150 గజాల ఇంటి స్థలానికి ఇవ్వాలని, స్ట్రక్చర్‌కు ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, వృక్షాలకు కూడా పరిహారం ఇవ్వాలని, బిఆర్‌టిఎస్‌ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు సింహాచల దేవస్థానం ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బలివాడ వెంకటరావు, బాధితులు సిహెచ్‌.సత్యనారాయణ, లంక అప్పలరాజు, ఆల్తి నాగమణి, పిల్లి సుకన్య, ముద్దాడ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.