అనంతపురం కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభివద్ధిలో వ్యవసాయం, పరిశ్రమలు కీలకమని వీటిపట్ల వైసిపి తన వైఖరి ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ నెల 29న నిర్వహించిన జిల్లా సమగ్రాభివద్ధి- ప్రత్యామ్నాయ విధానాల సదస్సు తీర్మానాలను సోమవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివద్ధికి వివిధ రంగాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానాల గురించి ఈ సదస్సులో తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి ఇచ్చిన హామీల అమలు పది సంవత్సరాల గడువు ఈ సంవత్సరం చివరికి పూర్తవుతుందని, ఆ హామీలు అమలు కానందున మరో పది సంవత్సరాల ఈ గడువు పొడగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలన్నారు. జిల్లా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. గతంలో కేవలం వేరుశనగ వంట మాత్రమే సాగవుతున్న స్థితి నుంచి నేడు ఎడారిలో పండే కర్జూరం, మంచు ప్రాంతాల్లో పండే ఆపిల్ పండ్ల వరకు జిల్లాలో పండిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 7.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు అవుతున్నాయని తెలిపారు. ఈ పంటల దిగుబడులకు అనుగుణంగా జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం, పరిశ్రమలు స్థాపించకపోతే రైతులు మరో విషాదంలో కూరకపోతారని తెలిపారు. సాగునీటి వనరులు అభివద్ధి చెందుకుండా జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు అభివద్ధి చెందవన్నారు. హంద్రీనీవాకు నిర్ణయించన ఆయకట్టుకు నీరు అందివ్వడం, హెచ్‌ఎల్‌సి కాలువ నిర్వహణ, ఆధునీకరణకు అవసరమైన నిధులు, సిబ్బందిని నియమించాలన్నారు. ప్రస్తుతం హెచ్‌ఎల్‌సి, హంద్రీనీవా కింద సాగవుతున్న పంటల రక్షణ కోసం కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి నీటి సదుపాయం కలిపించాలన్నారు. జిల్లాలో ఉన్న ఖనిజవనరులు ఆధారంగా పరిశ్రమలు స్థాపించాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రాయితీలను ప్రభుత్వం ఇచ్చి స్థాపించాలన్నారు. ఐటి పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కలిపించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సామాజిక తరగతుల అభివద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలంటే కుల గణన జరగాలన్నారు. జిల్లా ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల అంచనాకు తెలంగాణలోని 'సెస్' తరహాలో గణాంకాలు ప్రతి సంవత్సరం ప్రకటించాలన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో వచ్చిన కరువులో కూలీలు వలసలు వెల్లకుండా నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలు చేయాలన్నారు. విద్యా, వైద్యం పూర్తి వ్యాపారంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులు లేక మూతపడే స్థితికి వచ్చాయని, మరోవైపు నారాయణ, చైతన్య కాళాశాలల్లో పది వేల మందికి పైగా జిల్లా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల రూ.వేల కోట్లు భారం జిల్లా ప్రజల మీద పడుతోందన్నారు. జిల్లాలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లాగా నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రారంభమవుతునాయని, వీటిని అరికట్టడానికి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మాణాలను ప్రజల్లో ప్రచారం చేసి ప్రభుత్వంపై పోరాడడం కోసం ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం 15న విజయవాడలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, జిల్లా కమిటి సభ్యులు ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వి.రామిరెడ్డి, ఎం. నాగమణి పాల్గొన్నారు.










