Nov 03,2022 00:08

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే ఆదేశం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూహక్కు భూరక్ష కార్యక్రమం ద్వారా ఏజెన్సీలోని భూములన్నింటికీ ఆరు నెలల్లో రీ సర్వే పూర్తి చేయాలని తహశీల్దార్లను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే ఆదేశించారు. బుధవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు మందిరంలో ఏడు మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, విఆర్‌ఒలతో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌తో కలిసి పిఒ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు భూములు, గ్రామ సరిహద్దులు ముందుగా నిర్ధారించి రీ సర్వే చేయాలని సూచించారు. మండలాల్లో ఎన్ని రోవర్స్‌ అవసరం ఉన్నది, ఎన్ని టెక్నికల్‌ టీంలు ఏర్పాటు చేయుచున్నది, ఎన్ని క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నదీ మండలాల అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్లు 60 మంది వరకు అవసరమవుతున్నారని తహశీల్దార్లు వెల్లడించారు. సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ మాట్లాడుతూ అన్ని మండలాలలోని డిజిపియస్‌ మిషన్‌ ద్వారా ఈ రీసర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్లు కె.దేవేంద్రుడు, కె.రాజశేఖర్‌, ఆయా మండలాల తహశీల్దార్లు పిఎన్వి ప్రసాద్‌, శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, సుబ్రమణ్యఆచారి, సిహెచ్‌.శ్రీనివాసరావు, కె.సుధాకర్‌ పాల్గొన్నారు.