Aug 10,2022 23:42

కౌన్సిల్‌ సమావేశంలో సమస్యలు వివరిస్తున్న హేమలత

ప్రజాశక్తి -పిఎం పాలెం : 5వ వార్డులోని సమస్యలపై బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్‌ మొల్లి హేమలత తన గళం వినిపించారు. ముఖ్యంగా వార్డులో సర్వేనెం 27లో అయ్యప్పనగర్‌ తాగునీటి ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. మేయర్‌ పర్యటనలో ఒకే ఒక నీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చి జివిఎంసి సిబ్బంది మమ అనిపించారన్నారు. దీనివల్ల కొండవాలు ప్రాంతాల ప్రజలు తాగు నీటి కష్టాలు అనుభవిస్తున్నారని, తక్షణం అయ్యప్పనగర్‌ నీటి ప్రాజెక్ట్‌ ద్వారా కొండవాలుప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ మంజూరు చేయాలని కోరారు. కొండవాలు ప్రాంతాలైన శారదానగర్‌, అయ్యప్పనగర్‌, సాయిరామ్‌కాలనీ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, వైఎస్‌ఆర్‌ కాలనీ, పిపి-1, పిపి-2, స్వతంత్రనగర్‌ హుదూద్‌ కాలనీలలో యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సదుపాయం కల్పించాలని, రాజీవ్‌ గృహకల్ప కాలనీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీని మెరుగుపరచాలని, అధ్వానంగా ఉన్న రోడ్లను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి స్పందిస్తూ 5వ వార్డు తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్‌ లకీëశకు సూచించారు. కౌన్సిల్‌ అనంతరం కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీశకు కార్పొరేటర్‌ హేమలత, 5వ వార్డు టిడిపి సీనియర్‌ నాయకులు మొల్లి లక్ష్మణరావు కలిసి వార్డు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్‌ త్వరలోనే వార్డులో పర్యటిస్తానని హామీఇచ్చారు.