Aug 23,2023 22:29

సమావేశంలో మాట్లాడుతున్న మహాలక్ష్మి

* జయప్రదం చేయాలి : వెలుగు విఒఎల సంఘం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
విఒఎల సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు ఐదో తేదీన డిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు వెలుగు విఒఎల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు తెలిపారు. ధర్నాకు విఒఎలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సంఘ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడుతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మూడేళ్ల కాల పరిమితిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విఒఎలకు వేతనాలు పెంచాలని, సిబిఒహెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని కోరారు. రూ.పది లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, అన్నిరకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విఒఎల పని భద్రతను, ఉపాధిని దెబ్బతీసే కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. గ్రామ సమాఖ్యల మెర్జ్‌ ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం వంటి పనులు సెర్చ్‌ అధికారులే చేయడం సరైంది కాదన్నారు. విఒఎలను మెర్జ్‌ చేయడం వల్ల వేలాది మందికి ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి నష్టం లేకుండా ఎక్కువ సంఘాలున్న విఒఎల నుంచి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్పారు. ఇప్పటివరకు 15 సంఘాల్లోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఒఎగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలన్నారు. జెండర్‌, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని కోరారు. లోకో యాప్‌ పని కోసం 5జి మొబైల్‌ ఫోన్లను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విఒఎలకు టార్గెట్‌ ఇచ్చే పద్ధతి ఆపాలన్నారు. గౌరవ వేతనం ఎం.ఎన్‌ అకౌంట్స్‌ వేయడం ఆపాలని, వేతనాల చెల్లింపు చెక్కులపై సిసి, ఎపిఎం సంతకాలు లేకుండా చూడాలన్నారు. రికవరీ పేరుతో వేతనాలు కోత విధించడం ఆపాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
సమావేశం అనంతరం సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా అల్లు మహాలక్ష్మి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు, కోశాధికారిగా కె.సీతమ్మ, ఉపాధ్యక్షులుగా డి.జోగారావు, ఉప కార్యదర్శిగా ఎ.దుర్గమ్మ, కమిటీ సభ్యులుగా వి.మోహనరావు, జి.అరుణ, ఎం.ప్రభావతి, ఎస్‌.లక్ష్మి తదితరులు ఎన్నికయ్యారు.