Mar 17,2023 00:55
మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌:  కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5న ఢిల్లీలో జరిగే కార్మిక-కర్షకుల పోరాట ప్రదర్శన జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ పిలుపునిచ్చారు. సిఐటియు బాపట్ల జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వాన బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలను మరింత జటిలం చేస్తోందన్నారు. అత్యంత ధనవంతులైన అదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగి తేలుతోందని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తుందని పేర్కొన్నారు. పెద్దఎత్తున పేదలు, కార్మికులు ఉపాధి అవకాశాలు, ఆదాయాలు తగ్గుతూ కార్పొరేట్‌ వ్యాపారవేత్తల ఆదాయాలు ఘనంగా పెరుగుతున్నాయి. కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు, సమ్మెలు చేయకుండా, యూనియన్‌ ఏర్పాట్లో ఆంక్షలు పెడుతుందని విమర్శించారు. కనీస వేతనాలు, పనిగంటలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర కార్మిక హక్కులపై బిజెపి ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000, కనీస పెన్షన్‌ రూ.10,000 అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, టైం స్కేల్‌, డైలీ వేజ్‌, గౌరవ వేతన కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, అందరికీ సామాజిక భద్రత, సిపిఎస్‌ రద్దు, ఓపిఎస్‌ పునరుద్ధరణ, అందరికీ నాణ్యమైన విద్య, వైద్య విధానం, అధిక ధరలు తగ్గించాలని, ప్రజలు తిండి తినే ఆహార పదార్థాలు, నిత్యావసరాలపై జిఎస్టి ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వంట గ్యాసులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని, వ్యవసాయ కార్మికులు, రైతాంగం హక్కులను రక్షించాలని ఏప్రిల్‌ 5 ఢిల్లీలో జరిగే కార్మిక-కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మణిలాల్‌, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ గంగయ్య, ఎం వసంతరావు పాల్గొన్నారు.