ప్రజాశక్తి- కలెక్టరేట్ : పాలు, మజ్జిగ, మాంసం తదితర ప్యాక్డ్ ఆహారపదార్థాలపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జైల్ భరో నిర్వహించనున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్ తెలిపారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి పాలనలో నిత్యవసర వస్తువులు, ఇతర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో పేద, మధ్యతరగతితో పాటు అన్ని తరగతుల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక బిజెపిని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను విచారణ పేరుతో వేధింపులకు, ఇబ్బందులకు గురి చేస్తున్న బిజెపి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఈ నెల 5 న విజయవాడలో గవర్నర్ బంగ్లా ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని, గవర్నర్‌ను ఘెరావ్ చేస్తామని తెలిపారు. ఈ నెల 9 వ తేదీ నుంచి 14 వరకు 'ఆజాదికా గౌరవ యాత్ర' పేరుతో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రస్థాయిలో వంచిస్తుందని విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని, ఆఖరికి విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ చర్యను ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించకపోతే సాధించడం సాధ్యం కాదని చెప్పారు. లాభాల్లో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా పార్లమెంటులో అడ్డుకోలేని పరిస్థితిలో వైసిపి ఎంపీలు ఉన్నారని, కనీసం ప్రశ్నించలేని దద్దమ్మలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో గొంప గోవిందరాజు, జిఎ.నారాయణరావు, ఎస్‌సి సెల్ నాయకుడు చోడదాసి సుధాకర్, బిసి సెల్ నాయకుడు మూల వెంకటరావు, హైదర్‌ఆలీ సింకా, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు.










