ప్రజాశక్తి-బాపట్ల: కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5 డిల్లీలో కార్మిక-కర్షకుల పోరాట ప్రదర్శన జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు బాపట్ల జిల్లా కార్యాలయంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కేంద్రంలో మోడీ నాయకత్వాన ఉన్న ప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు, రైతులు, ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున పెరిగాయి. దేశంలో మోడి ప్రభుత్వం అత్యంత ధనవంతులైన అదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగి తేలుతోందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రశ్నించిన వారిని సైతం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోంది. పేదలు, కార్మికులు ఉపాధి అవకాశాలు, ఆదాయాలు తగ్గుతూ కార్పొరేట్ వ్యాపారవేత్తల ఆదాయాలు ఘనంగా పెరుగుతున్నాయి. కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులు సమ్మె చేయకుండా, యూనియన్ల ఏర్పాట్లలో ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. కనీస వేతనాలు, పనిగంటలు, పిఎఫ్, ఈఎస్‌ఐ ఇతర కార్మిక హక్కులపై దాడి చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్ రూ.10 వేలు అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, టైం స్కేల్, రోజువారి కూలి, గౌరవ వేతన కార్మికులును పర్మినెంట్ చేసి, అందరికీ సామాజిక భద్రత కల్పించడంతోపాటు సిపిఎస్ రద్దు, ఓపిఎస్ పునరుద్ధరించాలన్నారు. విద్య, వైద్య విధానం, అధిక ధరలు తగ్గించాలని, ఆహార పదార్థాలు, నిత్యావసరాలుపై జిఎస్టి ఉపసంహరించాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాసులపై ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్నారు. వ్యవసాయ కార్మికులు, రైతాంగం హక్కులను రక్షించాలని ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే కార్మిక-కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, జి సుధాకర్, పి రేఖఎలిజబెత్, కె లక్ష్మి, జి ప్రతాప్, సిహెచ్‌వి రంజని, సామియేలు, బి తిరుమలరెడ్డి పాల్గొన్నారు.










