Mar 30,2023 23:40

మద్దిలపాలెంలో సిఐటియు ఆధ్వర్యాన బైక్‌ర్యాలీ

మోడీ విధానాలను ఓడించడమే లక్ష్యంగా
5న చలో ఢిల్లీ జయప్రదం చేయండి
ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ :
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 5న లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ ఆందోళనలో విశాఖ కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి పి.మణి పిలుపునిచ్చారు. గురువారం మద్దిలపాలెం కళాభారతి దరి సిఐటియు జోన్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. మద్దిలపాలెం నుంచి సత్యం జంక్షన్‌ ఈనాడు, సీతమ్మధార, హెచ్‌బి. కాలనీ మీదుగా వెంకోజిపాలెం, ఎంవిపి, పెదవాల్తేరు, రామా టాకీస్‌ మీదుగా తిరిగి మద్దిలపాలేనికి బైక్‌ర్యాలీ చేరుకుంది.
ఈ సందర్భంగా సిఐటియు నేత మణి మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తూ, కార్మికచట్టాలను సంస్కరించి, లేబర్‌ కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాస్తోన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆదానీ, అంబానీ కార్పొరేట్ల సేవలో తరిస్తోందని మండిపడ్డారు. కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, హక్కుల కోసం కార్మికవర్గం పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం, ఆకలి మంటలు దేశాన్ని చుట్టుముడుతోంటే, జిడిపి వృద్ధి చెందుతోందంటూ బూటకపు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో మోడీ విధానాలను ఓడించడమే లక్ష్యంగా లక్షలాది మందితో చేపట్టే చలో ఢిల్లీ ఆందోళనను జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ అధ్యక్ష కార్యదర్శులు జే.ఆర్‌.నాయుడు, పి.వెంకట్రావు, నాయకులు కే.కుమారి అనపర్తి అప్పారావు దల్లి రవి, ఏ.సింహాచలం, అప్పారావు పాల్గొన్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
కలెక్టరేట్‌ : దేశ సంపదను వృద్ధి చేయడంలో కీలకభూమిక నిర్వహిస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రచట్టం చేసి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలీ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులు వై.రాజు డిమాండ్‌ చేశారు. గురువారం టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద ఎం. సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏప్రిల్‌ 5 చలో ఢిల్లీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. చలోఢిల్లీ ర్యాలీలో రైతులు, కౌలురైతులు, కూలీలు,కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదంచేయాలని కోరారు. సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి కెవిపి చంద్రమౌళి మాట్లాడుతూ ముఠా కళాసీలకు సమగ్ర చట్టం చేసే వరకు పోరాడుతామని, పిఎఫ్‌ ఇఎస్‌ఐ, పెన్షన్‌ బీమా ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. రాబోయే తరానికి జీవనోపాధి, ఉద్యోగావకాశాలు కల్పనకు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో హమాలీ నాయకులు నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి
కలెక్టరేట్‌: ఆటో మోటార్‌ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) నేత కె సత్యనారాయణ అన్నారు. గురువారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ జయప్రదానికి ఆటో కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికులకు కనీస రక్షణ లేదని, ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, వారి కుటుంబం రోడ్డున పడాల్సిందేనన్నారు.ఆటో, మోటార్‌ కార్మికులపై దాడులు ఆపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటీసులు రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 21 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ అధ్యక్షులు పి.రాజ్‌కుమార్‌, గౌరవాధ్యక్షులు బి.జగన్‌, నాయకులు జిఎస్‌ ప్రకాష్‌, శ్రీధర్‌, ఎల్లారెడ్డి, అప్పలరాజు పాల్గొన్నారు.