Mar 29,2023 01:21
చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రాణి, నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: వచ్చే నెల 5వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి వంకాయలపాటి రాణి పిలుపునిచ్చారు. మంగళవారం బాపట్ల పట్టణంలో పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు మోండ్రు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వంకాయలపాటి రాణి మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రతి కుటుంబానికి 200 రోజులు తగ్గకుండా పని కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉపాధి హామీ పని ఒక పూట ఉండేదని, అటువంటిది ఇప్పుడు రెండు పూటలు చేయాలనే విధానాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై జరిగే 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, మందుల ధరలు, ఆహార పదార్థాలతో సహా నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచారు. జీఎస్టీ, చెత్త పన్ను విధించి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌ మీటర్లు డిజిటల్‌ మీటర్లు తెస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పేద ప్రజలకు కొద్దిపాటి ఆదాయాన్ని కల్పించే పనికి ఆహార పథకాన్ని నిధులు తగ్గించి పనులు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నారని విమర్శించారు. నల్లధనం మొత్తం తెస్తామని, ప్రతి ఒక్కరి ఎకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి సామాన్య మధ్య తరగతి ప్రజలు మోసం చేశారన్నారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి కృష్ణమోహన్‌, జిల్లా నాయకులు బి అగస్టీన్‌, తంగిరాల వెంకటేశ్వర్లు, నూతలపాటి కోటేశ్వరావు, బొనిగల సుబ్బారావు, మురుగుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
పంగులూరు: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరలకై పార్లమెంటులో చట్టం చేయాలని, 2022 విద్యుత్‌ సంస్కరణ బిల్లు రద్దు చేయాలని, వ్యవసాయ పంప్‌ సెట్లకు మీటర్ల రద్దుచేసి, ఉచితంగా కరెంటును కొనసాగించాలని కోరుతూ, ఏప్రిల్‌ 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కమిటీ కార్యదర్శి తలపనేని రామారావు కోరారు. మంగళవారం పంగులూరు మండలంలోని అలవలపాడు, రేణింగవరం, ముప్పవరం, భగవాన్‌ రాజుపాలెం, గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 65 శాతం ప్రజలు ఆధారపడిన, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ పరం చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలను విద్యుత్‌ బిల్లు రద్దుపై రైతులు ఏడాది పాటు నడిపిన చారిత్రాత్మక రైతు ఉద్యమానికి తలొగ్గి ప్రభుత్వం చట్టాలను రద్దు చేస్తూ ప్రకటించిందని, రైతు సంఘాలతో చర్చించి ఆ సమస్యలపై నిర్ణయం తీసుకుంటామని లిఖితపూర్వక హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. దేశ ప్రజలు కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులను తెగ నమ్ముకుంటున్నారని, కార్మికుల హక్కులను కాలుస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్మిక రక్త మాంసాలను హరించివేస్తున్నారన్నారు. రైతుల హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
రాష్ట్రాల హక్కులను హరించి రాజ్యాంగానికి పెను ప్రమాదం తెస్తున్నారని విమర్శించారు. పై సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతు సోదరులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.